ఆర్జీవీకి 29.67 కోట్ల లీగల్ నోటీసు: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రొడక్షన్ హౌస్ సంచలన హెచ్చరిక
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్లాటెంట్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయనకు ఏకంగా 29.67 కోట్ల రూపాయలకు పైగా లీగల్ నోటీసులు జారీ చేసింది. సుమారు పదిహేనేళ్ల నాటి ఒప్పంద వివాదం మళ్లీ తెరపైకి రావడం, అలాగే ఆయనతో ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపవద్దని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు మరియు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రొడక్షన్ హౌస్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఆర్థిక వివాదం 2010 ఏప్రిల్ 10న జరిగిన ఒప్పందానికి సంబంధించినదిగా తెలుస్తోంది. అనంతరం 2013 ఏప్రిల్ 17న బాంబే హైకోర్టు కూడా ఈ ఒప్పందాన్ని సమర్థించిందని సమాచారం. ఒప్పంద నిబంధనల ప్రకారం వర్మ నిర్మించే, దర్శకత్వం వహించే, రాసే లేదా భాగస్వామ్యం వహించే నిర్దిష్ట ప్రాజెక్టులకు సంబంధించి సదరు నిర్మాణ సంస్థ నుండి ముందస్తు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అప్పుడటి బకాయిలు మరియు దాదాపు 11.38 కోట్ల రూపాయల వడ్డీతో కలిపి మొత్తం 29.67 కోట్ల రూపాయలను చెల్లించాలని సదరు సంస్థ వర్మను ఆదేశించింది.
ఈ వివాదం కేవలం వర్మకే పరిమితం కాకుండా మొత్తం చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎక్లాటెంట్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్ర పరిశ్రమకు స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తూ వర్మ ప్రాజెక్టులకు సంబంధించిన హక్కులను కొనుగోలు చేయవద్దని, ప్రసారం చేయవద్దని లేదా ఓటీటీలలో స్ట్రీమింగ్ చేయవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ బకాయిలు చెల్లించకపోతే ఒప్పందంలో ఉన్న చిత్రాలు, వాటి ఆర్థిక లాభాలు, హక్కులపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
మరోవైపు వర్మ ప్రస్తుతం హర్షవర్ధన్ రాణే ముఖ్య పాత్రలో నటిస్తున్న పోలీస్ కంపెనీతో పాటు పోలీస్ స్టేషన్ మే భూత్ వంటి చిత్రాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులపై పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. అయితే ఎక్లాటెంట్ ఫిలింస్ నుంచి వచ్చిన ఈ భారీ లీగల్ నోటీసుపై మరియు సినీ పరిశ్రమకు ఇచ్చిన హెచ్చరికలపై రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. రానున్న రోజుల్లో ఈ లీగల్ నోటీసు ఆయన కొత్త ప్రాజెక్టుల విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.
Also Read: వైసిపి ఆటలు సాగనివ్వం