పారిశుధ్యంలో పటాన్‌చెరు సరికొత్త అడుగు
పటాన్‌చెరు:నియోజకవర్గంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న కాలనీల అవసరాలకు అనుగుణంగా తోషిబా పరిశ్రమ సీఎస్ఆర్ నిధులతో రూ.12 కోట్ల వ్యయంతో 10 స్వీపింగ్ మిషన్లు, 10 టిప్పర్లను సమకూర్చారు. సోమవారం పటాన్‌చెరు మైత్రి మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్, తోషిబా పరిశ్రమ ప్రతినిధి మారు మోటోతో కలిసి తొలి విడతలో అందుబాటులోకి వచ్చిన ఐదు స్వీపింగ్ మిషన్లు, ఐదు టిప్పర్లను ప్రారంభించారు.
తొమ్మిది డివిజన్లలో మెరుగైన సేవలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 2014 నుంచి 2023 వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పటాన్‌చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగం విస్తరించి వందలాది నూతన కాలనీలు ఏర్పడ్డాయని తెలిపారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పటాన్‌చెరు, అమీన్‌పూర్ సర్కిళ్లలో పారిశుధ్య సేవలను విస్తరించేందుకు ఆధునిక వాహనాలను సమకూర్చినట్లు వివరించారు.తొలి విడతలో అమీన్‌పూర్ సర్కిల్‌కు మూడు స్వీపింగ్ మిషన్లు, మూడు టిప్పర్లు, పటాన్‌చెరు సర్కిల్‌కు రెండు స్వీపింగ్ మిషన్లు, రెండు టిప్పర్లు కేటాయించినట్లు తెలిపారు. బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి ఇస్నాపూర్ చౌరస్తా వరకు జాతీయ రహదారి పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా మరో స్వీపింగ్ మిషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌కు స్వీపింగ్ మిషన్, టిప్పర్‌తో పాటు జేసీబీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పారిశుధ్య సిబ్బందిని పెంచాలి
పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు. కార్మికులు మరణించిన స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడుతోందని, చెత్త సేకరణ సక్రమంగా జరగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి డివిజన్‌లో అవసరమైన పారిశుధ్య సిబ్బందిని తక్షణమే నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు అందించి సహకరించాలని కోరారు.
అభివృద్ధికి తోషిబా సహకారం
నియోజకవర్గ అభివృద్ధిలో తమ సంస్థను భాగస్వామ్యం చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తోషిబా పరిశ్రమ ప్రతినిధి మారు మోటో అన్నారు. భవిష్యత్తులోనూ అభివృద్ధి కార్యక్రమాలకు తమ సహకారం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిది డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ కోసం సీఎస్ఆర్ నిధులతో వాహనాలు సమకూర్చడం అభినందనీయమని శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు డిప్యూటీ కమిషనర్ కావ్య, అమీన్‌పూర్ డిప్యూటీ కమిషనర్ లలిత శ్రావణి, తోషిబా జనరల్ మేనేజర్ రామకృష్ణ, సీనియర్ మేనేజర్ రాజా, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, కుమార్ యాదవ్, సింధు రెడ్డి, అమీన్‌పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి,మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్,మాజీ డీసీ ప్రదీప్ కుమార్,అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.