పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పొడిగించాలిః మంత్రి పొన్నం
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు నవంబర్ 6 వ తేదీ తుది సమీపిస్తున్న నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ గడువును మరింత పొడిగించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇటీవల దసరా,రాబోయే దీపావళి వంటి వరుస పండుగలు రావడం వల్ల చాలామంది అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోలేకపోయారని మంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ గడువును పొడిగించి అర్హులందరికీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, పట్టభద్రులైన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు ఇతర రంగాలలోని అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల తమ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుండి పట్టభద్రులను గుర్తించి ఓటర్ నమోదు ప్రక్రియ చేయించాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.