భారతీయ యానిమేషన్ ప్రపంచంలో సంచలనం: 18 నెలల్లో బిలియన్ వ్యూస్ సాధించి నెట్‌ఫ్లిక్స్‌ను ఏలుతున్న ‘ఎమోమీ’!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అంతర్జాతీయ స్థాయిలో పిల్లలను అలరించే ప్రముఖ యానిమేషన్ షోలకు పోటీగా భారత్ నుంచి రూపొందిన ఒక స్వదేశీ యానిమేషన్ బ్రాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 18 నెలల వ్యవధిలోనే యూట్యూబ్‌లో వెయ్యి మంది సబ్‌స్క్రైబర్ల నుంచి ప్రారంభమై ఏకంగా ఒక బిలియన్ (100 కోట్లు) వ్యూస్‌ను సాధించిన ‘ఎమోమీ’ (Emomee) బ్రాండ్ డిజిటల్ దునియాను ఊపేస్తోంది. ఈ ఊహించని విజయంతో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా రెండు ప్రత్యేక సిరీస్‌లను దక్కించుకుని అంతర్జాతీయ రంగానికి భారతీయ యానిమేషన్ సత్తాను చాటిచెప్పింది.
భారతీయ పిల్లలకు మన సొంత కథలు, పాత్రల ద్వారా వినోదాన్ని అందించడంతో పాటు జీవిత నైపుణ్యాలను నేర్పించాలనే లక్ష్యంతో పూజా జౌహరి ఈ ఎమోమీ బ్రాండ్‌ను ప్రారంభించారు. సాధారణంగా విదేశీ కార్టూన్ పాత్రలపై ఆసక్తి చూపించే మన పిల్లలకు ‘ఈ, మో, మీ’ అనే మూడు ముద్దుల పాత్రలతో వినోదాత్మక విద్యా కంటెంట్‌ను అందించారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఆత్మవిశ్వాసం, సమస్యలను పరిష్కరించే తత్వం వంటి కీలకమైన 21వ శతాబ్దపు నైపుణ్యాలను కథల రూపంలో సులభంగా నేర్పించడమే ఈ బ్రాండ్ ప్రధాన ప్రత్యేకతగా నిలిచింది. యూట్యూబ్‌లో ప్రారంభమైన ఈ ప్రయాణం 2.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్లకు చేరుకుని ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో ఆదరణ పొందుతోంది.
యూట్యూబ్‌లో లభించిన తిరుగులేని విజయం తర్వాత ఎమోమీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘బిగ్ స్కిల్స్ ఫర్ లిటిల్ వన్స్’ మరియు ‘ప్లేటైమ్ ఎక్స్‌ప్లోరర్స్’ అనే రెండు కార్యక్రమాలతో ఓటీటీలోకి అడుగుపెట్టింది. పిల్లకు రంగులు, సంగీతం, సులువైన మాటలతో కూడిన యానిమేషన్ త్వరితగతిన నచ్చుతుందని మానసిక నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. భారతదేశం నుంచి ఈ స్థాయి గ్లోబల్ యానిమేషన్ ఫ్రాంచైజీ ఆవిర్భవించడం ఇదే మొదటిసారని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కంటెంట్‌ను మరిన్ని భాషల్లోకి విస్తరించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటా ఒక ప్రధాన భాగం చేయడమే తమ ప్రధాన ధ్యేయమని మేకర్స్ వెల్లడించారు.