మచిలీపట్నంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం, మేజర్ న్యూస్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ మచిలీపట్నం పట్టణంలోని సాయి పబ్లిక్ స్కూల్, సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్, పాండురంగ హైస్కూల్, టౌన్ హాల్‌తో పాటు ఉల్లింగిపాలెం, కాలేఖాన్పేట ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అడిగి తెలుసుకుని, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 1,400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా, ఓటు హక్కు వినియోగానికి ఆటంకం కలిగించినా, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.