దుబాయ్ వ్యాపార వర్గాల ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పెట్టుబడుల ఆహ్వానం
సూర్య జాతీయ డెస్క్: వచ్చే ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు సన్నాహకాల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా యూఏఈలోని దుబాయ్ నగరంలో పర్యటించిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అక్కడి వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తల ముందు వైబ్రెంట్ గుజరాత్ 2027 సదస్సుకు సంబంధించి ప్రత్యేక పిచ్‌ను ప్రదర్శించింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అనుకూల విధానాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించింది.
రాష్ట్రంలో లేబర్, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ శాఖ కార్యదర్శి లోచన్ సేహ్రా నేతృత్వంలో ఈ ప్రతినిధి బృందం దుబాయ్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా ఖతార్, ఒమన్ దేశాలను కూడా కవర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలకు చెందిన ఇన్వెస్టర్ల నుండి తమకు సానుకూల స్పందన లభించిందని ప్రతినిధి బృందం వెల్లడించింది. దుబాయ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.
గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ వేదికగా 2027 జనవరి 10 నుండి 12 వరకు పదకొండో విడత వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు అత్యంత వైభవంగా జరగనుంది. విక్షిత్ గుజరాత్ - షేపింగ్ గ్లోబల్ ఫ్యూచర్ అనే ప్రధాన థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2003లో ప్రారంభించిన ఈ గ్లోబల్ వేదిక, నేడు అంతర్జాతీయ స్థాయి వ్యాపార భాగస్వామ్యాలకు ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందింది. రానున్న సదస్సు ద్వారా ప్రపంచ దేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం గట్టి విశ్వాసంతో ఉంది.