బెంగాల్ సీపీఎం ప్రధాన కార్యాలయం ఎదుట 'చండీ పారాయణం': వామపక్షాల పాపాలను కడిగేయడానికేనన్న నిర్వాహకులు.. సీపీఎం కౌంటర్!
సూర్య జాతీయ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయం 'ముజఫర్ అహ్మద్ భవన్' (అలీముద్దీన్ స్ట్రీట్) ఎదుట మంగళవారం కొందరు వ్యక్తులు నిర్వహించిన 'చండీ పారాయణం' తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. శారదీయ నవరాత్రుల సందర్భంగా ఒక బృందం రోడ్డుపై కూర్చుని పవిత్ర హిందూ ధార్మిక గ్రంథమైన దేవీ మాహాత్మ్యంలోని 'చండీ పాత్' శ్లోకాలను పఠించింది.
ఎన్నడూ లేని విధంగా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వామపక్ష భావజాలం ఎల్లప్పుడూ సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ వచ్చిందని, వారి భావజాల పాపాలను ప్రక్షాళన చేయడంతో పాటు వారికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూనే తాము సీపీఎం కార్యాలయం ముందే ఈ పారాయణం చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ ఉదంతంపై సీపీఎం సీనియర్ నేత సుజన్ చక్రవర్తి తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ప్రచారం కోసం చేసిన చౌకబారు రాజకీయ విన్యాసమని కొట్టిపారేశారు. వీధుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడటం రాజకీయ బలహీనతకు నిదర్శనమని, వారికి వేరే పనిపాట లేకపోతే రోడ్లపై చండీ పారాయణం చేసుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, శ్లోకాలను సరిగ్గా ఎలా పఠించాలో నేర్పించే పరిజ్ఞానం తమ పార్టీ కార్యకర్తలకు కూడా ఉందని ఆయన చురకలంటించారు. పండుగ సీజన్లో జరిగిన ఈ ఘటన కోల్కతాలో మతపరమైన అంశాలు, రాజకీయ సిద్ధాంతాల మధ్య సరికొత్త వాగ్వాదానికి తెరతీసింది.