తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన పేరుగూడ రైతులు
కోర్టులో కేసు ఉండగానే భూముల పట్టాలు మార్పు!
తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన పెరుగుగూడ రైతులు
పెట్రోల్ బాటిల్ తో తహసీల్దార్ కార్యాలయంలో కి వచ్చిన మహిళా రైతు
అడ్డుకున్న పోలీసులు
మార్చిన రెవెన్యూ రికార్డులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్..
ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్న తహసీల్దార్
న్యాయస్థానంలో భూ వివాదానికి సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉండగానే తమ భూములను ఇతరుల పేర్లపై ఎలా మార్చారని ప్రశ్నిస్తూ పెరుగుగూడ రెవెన్యూ పరిధిలోని రైతులు బుధవారం కందుకూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మార్చిన రెవెన్యూ రికార్డులను వెనక్కి తీసుకొని, గతంలో తమ పేర్లపై ఉన్న పట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన రైతుల ఆందోళన సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది.
1974 నుంచి భూములు సాగు చేస్తున్న రైతులు
పెరుగుగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 24 ఎకరాల 35 గుంటల భూములు గతంలో సయ్యద్ మొహినుద్దీన్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయని రైతులు తెలిపారు. 1974 నుంచి బాచుపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి బావయ్య, శంకరయ్య, జంగయ్య, నర్సింహులు తదితరులు ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. సయ్యద్ మొహినుద్దీన్‌కు వారసులు లేకపోవడంతో 1984లో అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాగుదారులైన రైతులకు పట్టాలు జారీ చేసినట్లు వివరించారు.
2022లో వివాదం.. కోర్టును ఆశ్రయించిన రైతులు
అదే గ్రామానికి చెందిన పోచయ్య కుమార్తె బాలనర్సింహ్మ ఈ భూములు తన తాత ఆగయ్యకు చెందినవని పేర్కొంటూ 2006లో కుటుంబ ధ్రువీకరణ పత్రం పొందినట్లు రైతులు తెలిపారు. అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించగా, 2022లో అప్పటి ఆర్డీవో వెంకటాచారి 38-ఈ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వివరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో భూములను సాగు చేస్తున్న రైతులతో పాటు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఉన్న సుమారు 60 మంది రైతులు తమ భూములపై హక్కుల వివాదాన్ని లేవనెత్తుతూ 2022లో జిల్లా జాయింట్ కలెక్టర్‌ను, రంగారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. బాలనర్సింహ్మకు ఈ భూములతో సంబంధం లేదని పేర్కొంటూ న్యాయస్థానం నుంచి స్టే ఉత్తర్వులు పొందామని రైతులు వెల్లడించారు.
రికార్డుల మార్పుపై రైతుల ఆగ్రహం
న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగానే ఈ నెల 6న తహసీల్దార్ కె.గోపాల్ తమ భూములను బాలనర్సింహ్మ పేరుతో మార్చి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేయడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని, గతంలో ఉన్న రెవెన్యూ రికార్డులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయంలో నిరసనకు దిగారు.
ఈ క్రమంలో బాధిత మహిళా రైతు పెట్రోల్ బాటిల్‌తో కార్యాలయంలోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమె వద్ద ఉన్న బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైతులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, రికార్డుల మార్పుపై న్యాయం చేయాలని కోరారు.
ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం: తహసీల్దార్
రైతుల విజ్ఞప్తిపై స్పందించిన తహసీల్దార్ కె.గోపాల్.. ఇప్పటివరకు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లు, భూముల హక్కులకు సంబంధించిన అంశాలపై ఆర్డీవో, జిల్లా జాయింట్ కలెక్టర్లకు నివేదికలు పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మార్పు: తహసీల్దార్ గోపాల్ వివరణ
భూముల రికార్డుల మార్పుపై తహసీల్దార్ కె.గోపాల్ వివరణ ఇస్తూ, 2022లో అప్పటి ఆర్డీవో జారీ చేసిన 38-ఈ సర్టిఫికెట్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకే బాలనర్సింహ్మ పేరును రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసినట్లు తెలిపారు. భూముల హక్కులపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని పేర్కొన్నారు.
టి. శ్రీనివాస్:మేజర్ న్యూస్, కందుకూరు.