భారత్-డెన్మార్క్ సంబంధాలకు గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ప్రత్యేకత
సూర్య జాతీయ డెస్క్: భారత్-డెన్మార్క్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది ఇరుదేశాల మధ్య బంధానికి విలక్షణమైన గుర్తింపునిచ్చిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ శనివారం పేర్కొన్నారు. న్యూఢిల్లీలో డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముస్సెన్తో కలిసి ఐదో భారత్-డెన్మార్క్ జాయింట్ కమిషన్ సమావేశంలో జైశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ఏడాది మే నెలలో మూడో ఇండియా-నార్డిక్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సెన్ మధ్య జరిగిన చర్చలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ద్వారా డెన్మార్క్ సాంకేతిక సామర్థ్యాలు, భారత్ అభివృద్ధి వేగం, భారీ స్థాయి కలయిక సాధ్యమవుతోందని చెప్పారు. నీటి నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, గ్రీన్ షిప్పింగ్ రంగాలతో పాటు ఆరోగ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో సహకారం బలపడుతోందని వెల్లడించారు.
2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో డెన్మార్క్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశంలోని అనేక జాతీయ మిషన్లలో డెన్మార్క్‌తో కలిసి పనిచేస్తున్నామని, భారత్‌లో డెన్మార్క్ సంస్థల భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని తెలిపారు. ఇరుదేశాల మధ్య వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు, కంపెనీలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు అవసరమైన సహకారం అందిస్తాయని చెప్పారు. రక్షణ, భద్రత, ఉద్భవిస్తున్న సాంకేతికతలు, అంతరిక్షం, విద్య, నైపుణ్యాభివృద్ధి, రాకపోకల రంగాల్లో సహకారాన్ని మరింత లోతుగా విస్తరించే అవకాశాలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వివరించారు.
సంస్థాగత స్థాయిలో సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని జైశంకర్ నొక్కి చెప్పారు. ఇరుదేశాల మధ్య ఉన్న జాయింట్ వర్కింగ్ గ్రూపులు చురుగ్గా సమావేశం కావాలని, 2026-31 కాలానికి కొత్త భారత్-డెన్మార్క్ జాయింట్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చర్చలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యూరోపియన్ యూనియన్‌తో భారత్ సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని అన్నారు. భారత్-ఈయూ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ముఖ్యంగా భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తి కావడానికి డెన్మార్క్ అందిస్తున్న మద్దతును అభినందించారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భౌగోళిక రాజకీయ, వ్యూహాత్మక అంశాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకోవడం ఎంతో ముఖ్యమని జైశంకర్ పేర్కొన్నారు.