కొత్త ఫార్మ్ బిల్లును తక్షణమే ఆమోదించాలి..కాంగ్రెస్‌కు డొనాల్డ్ ట్రంప్ పిలుపు
సూర్య అంతర్జాతీయ డెస్క్: జనవరిలో డెమోక్రాట్లు కాంగ్రెస్‌పై నియంత్రణ సాధించేలోపే రిపబ్లికన్ సభ్యులు కొత్త ఫార్మ్ బిల్లును ఆమోదించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. చైనా సహా ఆసియా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్‌లో తిరిగి వస్తూ ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. 2027 నాటికి సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు స్పష్టత, భరోసా అవసరమని, ఆహార భద్రత అనేది జాతీయ భద్రతలో భాగమని ట్రంప్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో మిగిలి ఉన్న కొద్ది రోజుల్లోనే కొత్త బిల్లును ఆమోదించాలని, రైతులు మరింత జాప్యాన్ని కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
వ్యవసాయ రాయితీల నుంచి ఆహార సహాయ పథకాల వరకు విస్తృత అంశాలకు నిధులు సమకూర్చే ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఇప్పటికే ఏప్రిల్‌లో ఆమోదించింది. అయితే ఐదేళ్ల కాలానికి ఉద్దేశించిన ఈ సమగ్ర బిల్లు అధ్యక్షుడి ఆమోదం కోసం వెళ్లే ముందు సెనేట్ ఆమోదం పొందాల్సి ఉంది. 2023లో మునుపటి ఫార్మ్ బిల్లు గడువు ముగిసినప్పటి నుంచి రాయితీలు, ఆహార పథకాల నిబంధనలపై ఉభయ సభలలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య విభేదాల కారణంగా బిల్లు ఆమోదం ఆలస్యమవుతూ వస్తోంది.
మరోవైపు షెన్‌జెన్‌లో జరిగిన అపెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయి, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను మరింత పెంచాలని కోరారు. చైనాలో వ్యవసాయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉందని, ఆ అవసరాలను తీర్చడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుత ఏడాది సోయాబీన్ కొనుగోలు లక్ష్యానికి చైనా చేరువలో ఉన్నప్పటికీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందంలో వెనుకబడి ఉందన్న చర్చల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాలం చెల్లిన పాత వ్యవసాయ చట్టాల స్థానంలో ఆధునిక అవసరాలకు తగిన కొత్త విధానాలను తీసుకురావాలని రైతు సంఘాలు, వ్యవసాయ రంగాల ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పదవీకాలం ముగిసేలోపు సెనేట్‌లో ఈ బిల్లుపై ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అనే అంశంపై అమెరికా వ్యవసాయ, రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.