పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : రైతులు పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పి. సత్యవాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు . ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకొని ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగం ద్వారా వ్యవసాయ పనుల సామర్థ్యాన్ని పెంచుకొని, సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని ఆమె కోరారు . రాష్ట్రంలో పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర లాభదాయకమైన పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (అర్. కె. వి. వై) పరిధిలో క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ ( సి. డి. పి )ను అమలు చేస్తోందన్నారు . ఈ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ ఆధునిక వ్యవసాయ యంత్రాలను రాయితీపై అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు . ఈ పథకం కింద రైతులకు మల్టీ క్రాప్ త్రెషర్లు , డెస్టోనర్ కమ్ గ్రేడర్ కమ్ ఆస్పిరేటర్లు పంపిణీ చేయనున్నారు. ఈ యంత్రాల వినియోగం ద్వారా పంటల నూర్పిడి, శుభ్రపరచడం, నాణ్యత ఆధారంగా వేరు చేయడం వంటి వ్యవసాయ పనులను సులభతరం చేయడంతో పాటు వ్యవసాయ పనుల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు . ఈ పథకం అమలుకు మొత్తం రూ.666.66 లక్షల నిధులు కేటాయించగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.400 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.266.66 లక్షలుగా ఉంది.
నెల్లూరు జిల్లాకు కేటాయించిన యంత్రాలు
జిల్లాకు మొత్తం 32 వ్యవసాయ యంత్రాలు కేటాయించారు. వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.1. మల్టీ క్రాప్ త్రెషర్లు – 24 యూనిట్లు,జనరల్ కేటగిరీ – 19 యూనిట్లు,ఎస్సీ కేటగిరీ – 4 యూనిట్లు,ఎస్టీ కేటగిరీ – 1 యూనిట్లు,2. డెస్టోనర్ కమ్ గ్రేడర్ కమ్ ఆస్పిరేటర్లు – 8 యూనిట్లు,జనరల్ కేటగిరీ – 6 యూనిట్లు,ఎస్సీ కేటగిరీ – 2 యూనిట్లు
రైతులకు అందించే రాయితీ వివరాలు 1. మల్టీ క్రాప్ త్రెషర్లపై రాయితీ:
మల్టీ క్రాప్ త్రెషర్ల కొనుగోలుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు మరియు మహిళా రైతులకు ఒక్కో యూనిట్‌పై గరిష్ఠంగా రూ.1,00,000 వరకు రాయితీ అందజేస్తారు.ఇతర రైతులకు ఒక్కో యూనిట్‌పై గరిష్ఠంగా రూ.80,000 వరకు రాయితీ అందిస్తారు.అయితే, యంత్రం కొనుగోలు వ్యయంలో 50 శాతం లేదా పైన పేర్కొన్న గరిష్ఠ రాయితీ పరిమితి – ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని మాత్రమే రాయితీగా మంజూరు చేస్తారు.2. డెస్టోనర్ కమ్ గ్రేడర్ కమ్ ఆస్పిరేటర్లపై రాయితీ:
ఈ యంత్రాల కొనుగోలుకు ఒక్కో యూనిట్‌పై గరిష్ఠంగా రూ.1,00,000 లేదా యంత్రం కొనుగోలు వ్యయంలో 50 శాతం – ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రాయితీగా అందజేస్తారు.
దరఖాస్తు విధానం – ఎంపిక ప్రక్రియ
ఈ పథకం కింద వ్యవసాయ యంత్రాలను పొందేందుకు ఆసక్తి గల అర్హులైన రైతులు క్రింది విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.ఆసక్తి గల రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకులు (వి. ఏ ఏ ) ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.దరఖాస్తు చేసుకున్న రైతుల భూమి వివరాలను రెవెన్యూ రికార్డులు మరియు ఈ-పంట వివరాల ఆధారంగా పరిశీలిస్తారు. మండల వ్యవసాయ అధికారులు దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన రైతుల దరఖాస్తులను సంబంధిత డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులకు సిఫార్సు చేస్తారు.సహాయ వ్యవసాయ సంచాలకులు దరఖాస్తులను క్రోడీకరించి జిల్లా వ్యవసాయ అధికారికి పంపిస్తారు. జిల్లా వ్యవసాయ అధికారి సామాజిక వర్గాల వారీగా లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమోదం కోసం సమర్పిస్తారు.
ఈ పథకం కింద 2025–26 సంవత్సరానికి (ఎస్.ఎం.ఏ.ఎం) పథకంలో ఖరారు చేసిన యంత్రాల ధరల ప్రకారం, ఎంప్యానెల్ చేసిన సంస్థల ద్వారానే వ్యవసాయ యంత్రాల సరఫరా చేపడతారు.కావున అర్హులైన రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి, అవసరమైన వివరాలు సమర్పించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.