స్మార్ట్ గ్లాసెస్ కొనుగోలు చేయవద్దు..డచ్ డేటా నియంత్రణ సంస్థ కీలక హెచ్చరిక
సూర్య అంతర్జాతీయ డెస్క్: కెమెరాలు మరియు కృత్రిమ మేధస్సు ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ కొనుగోలు చేయవద్దని వినియోగదారులకు నెదర్లాండ్స్ డేటా రక్షణ సంస్థ అథారిటీ పర్సూన్స్‌గేగెవెన్స్ కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆరు రకాల స్మార్ట్ గ్లాసెస్‌పై అధ్యయనం చేసిన అనంతరం, ఈ పరికరాలు వినియోగదారులతో పాటు చుట్టుపక్కల ఉన్నవారి భద్రత మరియు గోప్యతకు ముప్పు కలిగిస్తున్నాయని సంస్థ స్పష్టం చేసింది. తెలియకుండానే ఇతరులను చిత్రీకరించడం ఆందోళనకరమైన అంశమని, ప్రాణాలకు ముప్పు వాటిల్లే సందర్భాల్లో ఈ గ్లాసెస్ తప్పుడు సమాచారం ఇవ్వడం మరింత ప్రమాదకరమని సంస్థ ఉపాధ్యక్షురాలు మోనిక్ వెర్డియర్ పేర్కొన్నారు.
పరీక్షల సందర్భంగా నిర్వహించిన అత్యవసర పరిస్థితి అనుకరణలో, ఒక వ్యక్తికి పునరుజ్జీవ ప్రక్రియ చేస్తుండగా స్మార్ట్ గ్లాసెస్ సహాయం కోరగా, తాను అత్యవసర నంబర్‌కు కాల్ చేశానని, అంబులెన్స్ వస్తోందని అవి తప్పుడు సమాచారం ఇచ్చాయి. వాస్తవానికి అలాంటి కాల్ ఏదీ వెళ్లలేదని సంస్థ వెల్లడించింది. అలాగే మందుల వినియోగ సూచనలను తప్పుగా అర్థం చేసుకోవడం, బొమ్మలపై ఉన్న భద్రతా హెచ్చరికలను సరిగ్గా చదవకపోవడం వంటి లోపాలు కూడా పరీక్షల్లో బయటపడ్డాయని అధికారులు తెలిపారు.
కొన్ని స్మార్ట్ గ్లాసెస్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని, వాటి వల్ల సమీపంలోని వ్యక్తులు యజమాని అనుమతి లేకుండానే పరికరంతో అనుసంధానమై రికార్డింగ్‌లను యాక్సెస్ చేసే లేదా కెమెరాను నియంత్రించే ప్రమాదం ఉందని నియంత్రణ సంస్థ గుర్తించింది. సాధారణ కళ్లద్దాల్లా కనిపిస్తూనే కెమెరాలు, మైక్రోఫోన్‌లు అమర్చబడి ఉండటంతో ఇతరులు గమనిస్తున్నారా లేక వీడియో తీస్తున్నారా అన్నది గుర్తించడం కష్టంగా మారిందని పేర్కొంది.
ఈ పరికరాలపై ఐరోపా వ్యాప్తంగా నియంత్రణ సంస్థలు, వినియోగదారుల సంఘాల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్‌లోని ఓ రిటైల్ సంస్థ స్మార్ట్ గ్లాసెస్ విక్రయాలను నిలిపివేయగా, గోప్యతా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు కూడా కొనసాగుతున్నాయి. వినియోగదారుల గోప్యత, భద్రతకు పూర్తిస్థాయి హామీ లభించే వరకు స్మార్ట్ గ్లాసెస్ వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.