తనకున్న మానసిక రుగ్మతపై స్పందించిన హీరో అశోక్ సెల్వన్.. భార్యకు పెట్టిన కండిషన్ అదే!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: 'ఓ మై కడవులే', 'నిన్నిలా నిన్నిలా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ ఇటీవల తనకు ఉన్న మానసిక సమస్య గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. తాను 'ఏడీహెచ్‌డీ' (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) అనే రుగ్మతతో బాధపడుతున్నట్లు వైద్యుల నిర్ధారణలో తేలిందని ఆయన తెలిపారు. తన భార్య కీర్తి పాండియన్ ప్రోత్సాహంతోనే హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఈ విషయం బయటపడిందని వెల్లడించారు.
ఈ రుగ్మత నిర్ధారణ అయిన తర్వాత తన ఆలోచనా విధానం, అలవాట్లపై తనకు పూర్తి స్పష్టత వచ్చిందని అశోక్ సెల్వన్ పేర్కొన్నారు. తనకు చిన్నప్పటి నుంచి సమయాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉండేదని, దాన్ని అధిగమించడానికి ఇప్పుడు ఎక్కువగా రిమైండర్లు పెట్టుకుంటున్నానని చెప్పారు. అలాగే రాత్రి వేళల్లో ఎక్కువగా తీవ్రంగా ఆలోచించే అలవాటు ఉందని, అందుకే రాత్రిపూట తనతో సీరియస్ విషయాలు మాట్లాడకూడదని భార్య కీర్తికి ముందే కండిషన్ పెట్టానని సరదాగా చెప్పుకొచ్చారు.
మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని దాన్ని అంగీకరించడం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీలు తమ మానసిక ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల ఇతరులకు కూడా అవగాహన పెరుగుతుందని సినీ అభిమానులు, నెటిజన్లు అశోక్ సెల్వన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. 2023లో హీరోయిన్ కీర్తి పాండియన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అశోక్ సెల్వన్, ప్రస్తుతం పలు ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నారు.