రణబాలి నుంచి ఫస్ట్ డాక్యుమెంటరీ విడుదల.. బ్రిటిష్ కాలంనాటి ఆకలి కేకల చరిత్ర వెలుగులోకి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం రణబాలిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, తాజాగా సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీ సిరీస్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి భాగమైన ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్ డాక్యుమెంటరీని అధికారికంగా విడుదల చేశారు.
బ్రిటిష్ పాలన సమయంలో దేశంలో చోటుచేసుకున్న తీవ్రమైన కరవు పరిస్థితులు, ఆ నాటి దుర్భర రోజులను ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టారు. అప్పట్లో తెల్లదొరల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, ఆకలి మంటల కారణంగా జరిగిన మారణకాండ తాలూకు నిజాలను చిత్ర బృందం ఇందులో వెల్లడించింది. చరిత్రపుటలలో మరుగున పడిన ఎన్నో వాస్తవాలను వెలికితీస్తూ ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు తెలుస్తోంది. సినిమా నేపధ్యం ఎంత శక్తివంతమైనదో ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ ప్రచార కార్యక్రమం ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఈ చారిత్రాత్మక నేపథ్యంలో సాగే సినిమా కథాంశాన్ని వివరిస్తూ మేకర్స్ మొత్తం నాలుగు భాగాలుగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో తొలి మూడు ఎపిసోడ్స్‌ను వరుసగా సోమవారం, బుధవారం, శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ప్రస్తుతం విడుదలైన తొలి భాగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు పెద్దఎత్తున షేర్ చేస్తూ తమ ఆసక్తిని వ్యక్తపరుస్తున్నారు. అక్టోబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.