నవంబర్ 14న ‘మెస్సి’ సినిమా విడుదల.. స్కూల్ పిల్లల చేతుల మీదుగా గ్లింప్స్ లాంచ్
ధామా టేల్స్ బ్యానర్‌పై ఆకర్ష ఆలపాటి నిర్మాణంలో నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెస్సి - లవ్ ఫ్రమ్ ఇండియా’. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్‌ను విద్యార్థుల చేతుల మీదుగా ఆవిష్కరించగా, నవంబర్ 14న బాలల దినోత్సరం కానుకగా సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.
సినీ పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆకర్ష ఆలపాటి సమర్పణలో, ధామా టేల్స్ పతాకంపై నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో రానున్న తాజా చిత్రం ‘మెస్సి - లవ్ ఫ్రమ్ ఇండియా’. ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జమునా అబ్దు రెహ్మాన్, విజయన్, సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు కీలకమైన పాత్రలు పోషించారు. పవిత్రమైన వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ గ్లింప్స్‌ను స్కూల్ పిల్లల చేతుల మీదుగా ప్రత్యేకంగా లాంచ్ చేయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ, చిన్నతనం నుంచి తనకు గల సృజనాత్మక ఆలోచనలతో పాటు యువ ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు తెలిపారు. మలయాళంలో మంచి ఆదరణ పొందిన ఈ తరహా కథాచిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ తమ బ్యానర్ ద్వారా మరిన్ని వినూత్న ప్రయత్నాలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ చిత్ర నిర్మాణంలో తనకు సహకరించిన పీవీఆర్ ఉదయ్, వెంకట్ మంచి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల పనితీరు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రముఖ సంగీత దర్శకుడు జేమ్స్ బిజాయ్ బాధ్యతలు నిర్వర్తించారు. నౌఫల్ అబ్దుల్లా ఎడిటర్‌గా వ్యవహరించగా, అశోక్ మల్లికార్జున వీఎఫ్ఎక్స్ (VFX) పనులను పర్యవేక్షించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరవింద్ బత్తిని, అతిథిగా విచ్చేసిన అర్జున్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.