మహిళల కోసం 'సూపర్ షీ ఛాలెంజ్' ప్రకటించిన 'కిల్లర్' చిత్రబృందం.. భారీ నగదు బహుమతులు!
అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సై-ఫై థ్రిల్లర్ చిత్రం 'కిల్లర్' మేకర్స్ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పోటీని ప్రకటించారు. 'సూపర్ షీ ఛాలెంజ్' పేరిట నిర్వహించే ఈ పోటీలో విజేతలకు భారీ క్యాష్ ప్రైజ్ అందించనున్నట్లు వెల్లడించారు.
వెండితెరపై సరికొత్త అనుభూతిని పంచేందుకు వస్తోన్న సై-ఫై థ్రిల్లర్ చిత్రం 'కిల్లర్'. జ్యోతి పూర్వజ్ మరియు పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా మరియు ఏయూ అండ్ ఐ స్టూడియోస్ పతాకాలపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు పూర్వాజ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోటీకి శ్రీకారం చుట్టారు. మహిళల కోసం ప్రత్యేకంగా 'సూపర్ షీ ఛాలెంజ్' (Super SHE Challenge) ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రంలోని కీలక భావనకు అనుగుణంగా, రాత్రికి రాత్రే మీకోసం ఏదైనా సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారనే అంశంపై మహిళలు తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఆసక్తి ఉన్నవారు తమ ఆలోచనలను రీల్స్ రూపంలో చేసి పంపవచ్చు. ఇలా బెస్ట్ రీల్స్ చేసిన పది మంది విజేతలకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. అలాగే రీల్స్ కాకుండా కేవలం టెక్స్ట్ రూపంలో తమ సమాధానాలు పంపే వారిలో ఉత్తమంగా నిలిచిన 20 మందికి ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ పోటీకి సంబంధించి మొత్తం రూ. 1,40,000 వరకు నగదు బహుమతులను విజేతలకు అందించనున్నారు.
పోటీలో పాల్గొనే వారు తమ రీల్స్ లేదా టెక్స్ట్ మెసేజ్‌లను ప్రధాన నటి జ్యోతి పూర్వజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ట్యాగ్ చేయడంతో పాటు #SuperSHE మరియు #KilleR అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించాలని సూచించారు. త్వరలోనే నిర్వహించబోయే 'కిల్లర్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఈ విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ వివరాలను తెలియజేస్తూ హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ప్రత్యేకంగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు.