ఫాంటసీ థ్రిల్లర్ మాయన్‌తో రాబోతున్న జయసూర్య.. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మలయాళ విలక్షణ నటుడు జయసూర్య వరుస ఫాంటసీ, మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. జాన్ లూథర్ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఆయన, భారీ బడ్జెట్ చిత్రం కత్తనార్ షూటింగ్ కారణంగా కొంత విరామం తీసుకున్నారు. ఆ తర్వాత టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఆడు 3, ఫాంటసీ థ్రిల్లర్ టైటాన్స్ సినిమాలతో తిరిగి థియేటర్లలో సందడి చేసిన జయసూర్య, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ మాయన్ చాప్టర్ 1 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
కళంకావల్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జితిన్ కె. జోస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత, దర్శకుడు రఫీతో కలిసి జితిన్ కె. జోస్ ఈ సినిమాకు కథను అందించగా, మ్యాజిక్ మూన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ గోవిందన్ నిర్మించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మొదటి భాగమైన మాయన్ చాప్టర్ 1 డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు సినీ ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఈ చిత్రంలో జయసూర్య ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. పురాతన ఆచారాలు, క్షుద్ర పూజలు, కరుత్తచ్చన్ అనే నిగూఢ అంశాల చుట్టూ సాగే మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జేసన్ వర్గీస్ పాత్రలో ఆయన నటన ఆకట్టుకునేలా ఉంది. రష్యాతో పాటు కేరళలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.
జయసూర్యతో పాటు నైలా ఉష, విజయ్ బాబు, జిబిన్ గోపీనాథ్, ఐశ్వర్య రాజ్, ఆర్ష బైజు, నిరంజన అనూప్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఫైజల్ అలీ సినిమాటోగ్రఫీ, ముజీబ్ మజీద్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ఉత్కంఠను పెంచాయి. విభిన్న కథాంశంతో వస్తున్న మాయన్ చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందోనని మలయాళంతో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.