ఎవరూ ఊహించని క్లైమాక్స్‌తో ప్రేక్షకుల ముందుకు తత్వం సినిమా.. హీరో దినేష్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు దినేష్ తేజ్ మరియు దష్విక జంటగా నటించిన తాజా వైవిధ్యమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తత్వం. అర్జున్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్ సంయుక్తంగా శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటీ నిర్మించారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రేపు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను పంచుకోవడానికి విలేకరుల సమావేశంలో పాల్గొన్న హీరో దినేష్ తేజ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సినిమాను అంగీకరించడానికి ప్రధాన కారణం కథలోని వైవిధ్యమేనని దినేష్ తేజ తెలిపారు. చిత్రంలో ఎవరూ ఊహించని విధంగా వచ్చే ట్విస్ట్‌లు, క్లైమాక్స్‌లో ఉండే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ఆయన పేర్కొన్నారు. మూఢనమ్మకానికి, నిజమైన నమ్మకానికి మధ్య ఉండే సన్నని గీత ఆధారంగా 2000వ సంవత్సరంలో నడిచే కథ ఇది. పూర్తిగా కొత్తదనంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ తనకు నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
సినిమా షూటింగ్ మరియు ప్రమోషన్ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడుతూ, ప్రచార సమయంలో తనకు, హీరోయిన్‌కు కారు యాక్సిడెంట్ జరగడం తీవ్ర ఆందోళన కలిగించిందని, ఆ ప్రమాదం నుంచి బయటపడటం తనకు రెండో జీవితం లాంటిందని దినేష్ తేజ భావోద్వేగానికి లోనయ్యారు. అనేక అడ్డంకులను ఎదుర్కొని సినిమాను ఈ స్థాయికి తీసుకువచ్చామని, కథపై ఉన్న నమ్మకమే తమకు అసలైన ధైర్యమని ఆయన తెలిపారు. విభిన్నమైన కథాంశాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ఈ చిత్రం కూడా ఆ కోవలో విజయవంతమై తన కెరీర్‌లో ప్రత్యేక గుర్ತಿంపు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.