యూ అండ్ ఏ సర్టిఫికేట్ పూర్తి చేసుకున్న చకోర సినిమా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చకోర లూనార్ లవ్ బర్డ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డాక్టర్ చింతాడ హేమారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యం వహిస్తుండగా, మంగా శ్రీనివాస్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు యూ అండ్ ఏ సర్టిఫికేట్‌ను జారీ చేయడం విశేషం. సినిమాను వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం.
ఈ చిత్రానికి సెన్సార్ కత్తెరకు పెద్దగా పని చెప్పాల్సిన అవసరం రాలేదని, ఎటువంటి కట్స్ లేకుండా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపుదిద్దుకుందని మేకర్స్ తెలిపారు. కేవలం రెండు గంటల పదిహేడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల తక్కువ నిడివితో సాగే ఈ సినిమా, ఆద్యంతం ప్రేక్షకులను సీట్లలో నుంచి కదలకుండా కట్టిపడేసేలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో రక్తి కట్టిస్తుందని సెన్సార్ బృందం ప్రశంసించింది. కథలోని భావోద్వేగాలు, సంగీతం మరియు విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9వ తేదీన ఘనంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మరియు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచగా, ప్రముఖ ఆడియో కంపెనీ టీ-సిరీస్ ఈ సినిమా ఆడియో హక్కులను దక్కించుకోవడం విశేషం. తక్కువ నిడివితో, పక్కా కమర్షియల్ మరియు ప్రేమకథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.