పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది: నిర్మాత వేణు దోనేపూడి ధీమా
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం బా బా బ్లాక్ షీప్. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న సినీ ప్రముఖులు సినిమా విశేషాలను పంచుకుంటూ చిత్రాలపై తమ అంచనాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ, బాక్సాఫీస్ వద్ద ఆ సమయంలో ఇతర పెద్ద సినిమాలు వస్తున్నప్పటికీ, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు అప్పట్లో అద్భుతాలు సృష్టించిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. తమ సినిమా కూడా అలాంటి ఘన విజయాన్నే సాధిస్తుందని బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ను మేఘాలయలోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో నిర్వహించామని, ఇందుకు సహకరించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ కె.సంగ్మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించేలా తాము ఒక ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహిస్తున్నామని, గెలిచిన వారికి మేఘాలయ ట్రిప్ వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత ఉపేంద్ర లిమాయె, టిను ఆనంద్, జార్జ్ మరియన్, విష్ణు ఓయ్, అక్షయ్ లగుసాని, మాల్వీ మల్హోత్రా, సమృద్ధి ఆర్యాళ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర లిమాయె మాట్లాడుతూ, దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు వారికి సినిమా అనేది ఒక ప్రాథమిక అవసరం లాంటిదని, అటువంటి సినిమా ప్రేమికులంతా ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు గుణి మంచికంటి మాట్లాడుతూ, రొటీన్‌కు భిన్నంగా ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా ఈ కథను తెరకెక్కించామని, కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడదగ్గ చక్కని క్లీన్ ఎంటర్‌టైనర్ ఇదని పేర్కొన్నారు.