కూతురి విడాకుల పుకార్లపై నటుడు అర్జున్ సర్జా స్పందన.. తప్పుడు వార్తలపై ఆగ్రహం!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా తన కుమార్తె ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వస్తున్న విడాకుల పుకార్లపై ఘాటుగా స్పందించారు. కుటుంబ సభ్యులపై నిరాధారమైన, తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యత లేకుండా ఇలాంటి కథనాలు అల్లడం సరికాదని హితవు పలికారు.
కొంతకాలంగా ఐశ్వర్య వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయని, విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో వదంతులు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పుకార్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులకు సూచించారు.
తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను ధృవీకరించుకోకుండా ఇష్టానుసారంగా వార్తలు రాయడం వల్ల అనవసర మానసిక ఆందోళన కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సినిమా రంగంలో దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా, కుటుంబ విలువలకు ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తారు. తాజా స్పందనతో తన కుమార్తె విడాకుల వార్తలకు తెరదించుతూ, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలకు గట్టి సమాధానం ఇచ్చారు.
Also Read: ట్రావిస్ హెడ్‌కు గస్ అట్కిన్సన్ దడ.. వరుసగా మూడు వన్డేల్లో ఔట్!