అందుబాటులో ఉండాలి.. మెరుగైన వైద్యం అందించాలి..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్..
సూర్య రాజన్న సిరిసిల్ల ..
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి రోజు ఓపీకి ఎంత మంది వస్తారని ఆరా తీశారు.ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, వ్యాక్సిన్లు, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు, ఇతర గదులు, ఫార్మసీ, ఆసుపత్రి ఆవరణలో పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఏ.ఎన్.ఎం. లతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్లు, గర్భిణీల ఆరోగ్య విషయాలపై దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలని సూచించారు.ఎన్.సీ.డీ స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దీని ద్వారా ముందు గానే వ్యాధి లక్షణాలను గుర్తించి, అవసరమైన చికిత్స అందించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణం, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.