ఎరువుల కొనుగోలుకు ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ తప్పనిసరి
దుర్గి మండలంలోని రైతులకు ఎరువుల విక్రయాలను పారదర్శకంగా, సులభతరంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ వినియోగంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.దుర్గి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి మునావత్ జగ్గారావు, మండల వ్యవసాయ అధికారి వై. అమీర్ రెడ్డి సందర్శించి యాప్ వినియోగ విధానాన్ని వివరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భూమి యజమానులతో పాటు కౌలు రైతులు కూడా ఈ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చని తెలిపారు. రైతులు ముందుగా తమ మొబైల్ ఫోన్లలో ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆధార్ నంబర్ లేదా రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడీ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం భూమి వివరాలను పరిశీలించి, సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయాలని సూచించారు.పంటకు సిఫార్సు చేసిన మోతాదుల ప్రకారం అవసరమైన ఎరువులు, బస్తాల సంఖ్యను ఎంపిక చేసుకున్న తర్వాత యాప్‌లో క్యూఆర్ కోడ్ రూపొందుతుందని వివరించారు. ఆ కోడ్‌ను ఎరువుల దుకాణదారునికి చూపిస్తే స్కాన్ చేసి ఎరువుల బస్తాలను అందజేస్తారని తెలిపారు.ఈ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన రైతులకు సక్రమంగా ఎరువులు అందుతాయని పేర్కొన్నారు. రైతులందరూ యాప్‌ను వినియోగించుకుని భూమి, పంట వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు వీఏఏలు,పలువురు రైతులు పాల్గొన్నారు.