పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
మర్పల్లి, మేజర్ న్యూస్: ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం మర్పల్లి మండలంలోని తిమ్మాపూర్, రావులపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. తిమ్మాపూర్ గ్రామంలో బేగరి భూపాల్–అంజలి, జోగు మహేందర్–రేణమ్మ, జోగు శ్రీకాంత్–లక్ష్మి, మామిడి శ్రీనివాస్–అనిత, తాండ్ర శ్రీశైలం–లక్ష్మి, మోముల లావణ్య–రాజు దంపతుల నూతన గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. అలాగే రావులపల్లి గ్రామంలో ఆలూరి ప్రభావతి–అశోక్, చింతకాయల సుమ–వినోద్ కుమార్ దంపతుల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు ఆత్మగౌరవం, భద్రత, భరోసా కల్పించే చిరునామా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ విడతలవారీగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, పేదల సొంతింటి కలను నెరవేర్చి ఆత్మగౌరవంతో కూడిన జీవనం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ యు. రవీందర్, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మర్పల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్, తిమ్మాపూర్ సర్పంచ్ గాయత్రి గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ సురేష్, పెద్దాపురం సర్పంచ్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు యాదవ్, యు. నగేష్, సురేష్, రావులపల్లి మాజీ సర్పంచులు అబ్రహం, రాచన్న, గోపాల్, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.