సినిమా, టీవీ, నాటక రంగాలకు నంది అవార్డులు.. ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ ప్రకటన!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నంది అవార్డుల ప్రదానానికి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్, టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ వెల్లడించారు. అలాగే 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ అవార్డులు) మరియు 2025 సంవత్సరానికి కూడా నంది ఫిల్మ్, టీవీ అవార్డులను ప్రధానం చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలన్నింటినీ డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. అక్టోబర్‌లో నంది ఫిల్మ్, టీవీ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, నవంబర్‌లో విజేతల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. నంది ఫిల్మ్, జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను అమరావతి లేదా విజయవాడలో, నంది టీవీ అవార్డుల ప్రధానోత్సవాన్ని తిరుపతి వేదికగా డిసెంబర్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు భరత్ భూషణ్ వెల్లడించారు.
నంది ఫిల్మ్ విభాగంలో మొత్తం 46 అవార్డులను అందించనున్నామని, ఇందులో ఉత్తమ చిత్రం, నటుడు, నటి, సహాయ నటులు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, సినీ పుస్తకాలు తదితర విభాగాలు ఉంటాయని ఆయన వివరించారు. విజేతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రాలు, నగదు పారితోషికాలు మరియు వివిధ కేటగిరీలలో 8 గోల్డ్ మెడల్స్ కూడా అందజేస్తామని స్పష్టం చేశారు.