అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు అనకాపల్లి చిత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో సినీ ప్రముఖుల ప్రశంసలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విక్రమ్ సహిదేవ్ హీరోగా, సంధ్యా వశిష్ట హీరోయిన్‌గా నటిస్తూ తెరకెక్కిన సరికొత్త రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా చిత్రం అనకాపల్లి. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా భవ్య శ్రీ మూవీ మేకర్స్ మరియు నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. త్రినాథరావు నక్కిన అందించిన కథ, స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలు ముఖ్య అతితులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రీ రిలీజ్ వేడుకలో సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ విక్రమ్ సహిదేవ్ భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడని, ఈ సినిమా ఘన విజయం సాధించి రెండు రాష్ట్రాల్లో గట్టి సౌండ్ చేయాలని ఆకాంక్షించారు. మరో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంతంపై తనకు మంచి ఎమోషన్ ఉందని, ఈ సినిమాతో దర్శకుడు త్రినాథరావు నక్కిన ఒక మంచి ప్రయోగం చేశారని ప్రశంసించారు. తారక్ పొన్నప్ప విలనిజం అందరినీ భయపెట్టేలా ఉందని, ఈ సినిమాలోని రూటెడ్ కంటెంట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మైత్రి రవి పేర్కొన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ సినిమాలోని ప్రతి పాత్ర చాలా సహజంగా, బలమైన భావోద్వేగాలతో ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన తారక్ పొన్నప్ప, సీనియర్ నటి ఇంద్రజ, హీరో హీరోయిన్లు తమ అనుభవాలను పంచుకుంటూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలిపారు. దేవ్ జండ్ అందించిన సంగీతం, మాయా వి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రూటెడ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.