'రామాయణం' చూసి ఫిదా అయిన అమల.. రెండో భాగం కోసం ఆసక్తి!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణంపై ప్రముఖ నటి అమల ప్రశంసల వర్షం కురిపించారు. విడుదలై రెండు వారాలు కావస్తున్నా ఈ సినిమాపై సినీ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా చిత్రాన్ని వీక్షించిన అమల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కళాక్షేత్రలో చదువుకునే రోజుల్లో రామాయణ గాథను రంగస్థలంపై అనేకసార్లు ప్రదర్శించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఆమె, ట్రైలర్ చూసినప్పటి నుంచే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశానని తెలిపారు. నితీశ్ తివారీ ఈ ఇతిహాసాన్ని వెండితెరపై ఎలా ఆవిష్కరించారో తెలుసుకోవాలనే కుతూహలంతో సినిమా చూశానని పేర్కొన్నారు.
రామాయణం వీక్షించిన తర్వాత తనకు ఎంతో సంతృప్తి కలిగిందని అమల చెప్పారు. సినిమాలోని ప్రతి పాత్రకు, ప్రతి సన్నివేశానికి మేకర్స్ పూర్తి న్యాయం చేశారని, భారతీయ సినిమా గర్వపడేలా చిత్రాన్ని రూపొందించారని కొనియాడారు. ఇతిహాస గాథను చూపించడమే కాకుండా, నేటి తరం ప్రేక్షకులు కూడా సులభంగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడం విశేషమని అన్నారు. నటీనటులు అద్భుతమైన భావోద్వేగాలను పండించారని, ఆ యుగాన్ని కళ్లముందు సాక్షాత్కరింప చేశారని ప్రశంసించారు.
సుపరిచిత కథే అయినప్పటికీ తెరపై ఆసక్తికరంగా మలిచారని, కొన్ని సన్నివేశాలు ఆశ్చర్యానికి గురిచేయగా, మరికొన్ని మధురానుభూతిని పంచాయని అమల వివరించారు. ముఖ్యంగా ప్రధాన పాత్రధారులు తమ పాత్రలకు ప్రాణం పోశారని, రావణ, సీత పాత్రల తీరు తనను విశేషంగా ఆకట్టుకుందని తెలిపారు. రాముడు యుద్ధానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రాబోయే పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొంటూ, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని, దర్శకుడు నితీశ్ తివారీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read: 'బతికి బయటపడ్డాం'.. అమితాబ్ బచ్చన్ పోస్ట్‌తో కలకలం, బెదిరింపుల నేపథ్యంలో ఆందోళన!