యోగులపర్వతంపై కార్తీకదీపం ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1008, నెయ్యి, 1503 వత్తి ఏర్పాటు -ప్రతాప్ స్వామీజీ చేతుల మీదుగా మహాదీప ప్రజ్వలన -కార్తీక మహాదీపోత్సవంలో పరమశివుడికి భక్తి నీరాజనం -శివనామ స్మరణతో మారు మ్రోగిన యోగుల పర్వతం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :
పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసంలో, ఆధ్యాత్మిక తేజస్సుకు నిలయమైన యోగులపర్వతం శివనామస్మరణతో, వేదమంత్ర ఘోషతో దివ్యకాంతులతో దేదీప్యమానంగా కార్తీకదీపం వెలిగించారు. ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1008, నెయ్యి, 1503 వత్తితో మహా దీపోత్సవం ఏర్పాటు చేశారు. మంగళవారం యోగులుపర్వతంపై జరిగిన ఈ పవిత్ర కార్యక్రమానికి ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ స్వయంగా పర్వత శిఖరంపై కార్తీక మహాదీపాన్ని వెలిగించి, సకల జీవరాశుల క్షేమం, లోకకల్యాణం కోసం పరమేశ్వరుడిని ప్రార్థించారు. శివనామస్మరణ మధ్య మహాదీపం ప్రజ్వలించిన ఆ పవిత్ర ఘడియ భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. పర్వతమంతా శివజ్యోతితో ప్రకాశించింది.
దీపమే పరమాత్మతత్త్వం..
చీకటిని తొలగించి వెలుగును ప్రసరింపజేసే దీపం, మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే పరమాత్మ తత్త్వానికి ప్రతీక అని స్వామీజీ సందేశమిచ్చారు. కార్తీక దీపారాధన కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని, జీవనంలో ధర్మం, భక్తి, జ్ఞానం, సేవాభావం అనే వెలుగులను నింపే పవిత్రమైన ఆధ్యాత్మిక సంప్రదాయమని తెలిపారు. పర్వత శిఖరంపై వెలిగించే మహాదీపం ద్వారా సమస్త ప్రపంచానికి శాంతి, సౌభాగ్యం, సకల జీవరాశులకు క్షేమం కలగాలని ప్రార్థించడమే ఈ మహోత్సవంలోని అంతరార్థమని వివరించారు.
జ్ఞానమనే జ్యోతిని వెలిగించడమే కార్తీక మహాదీపం
దీపం వెలిగేది పర్వత శిఖరంపై...కానీ ఆ వెలుగు నిండాల్సింది ప్రతి ఒక్కరి హృదయంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే జ్యోతిని వెలిగించడమే కార్తీక మహాదీపం యొక్క పరమార్థం ప్రతాప్ స్వామీజీ తెలిపారు. ప్రకృతి ఒడిలో, దివ్యమైన పర్వత వాతావరణంలో, పరమశివుని స్మరిస్తూ వెలిగించిన ఈ మహాదీపం యోగులపర్వతం ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని మరింత చాటిచెప్పింది. ఈ పవిత్ర సందర్భంలో పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ సమస్త మానవాళి సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆకాంక్షించారు. యోగులపర్వతంపై వెలిగిన ఈ కార్తీక మహాదీపం భక్తి జ్యోతిగా, ధర్మ జ్యోతిగా, లోకకల్యాణ జ్యోతిగా నిరంతరం ప్రకాశించాలని భక్తులు పరమేశ్వరుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా భక్తులు శివ నామాలు పటిస్తూ ఓం నమశ్శివాయ అనే మంత్రంతో యోగుల పర్వతం మారు మ్రోగింది.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్