విశాఖ ఎంపీ శ్రీభరత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్.కోట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు
లక్కవరపు కోట, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శృంగవరపుకోట (ఎస్.కోట) నియోజకవర్గ ప్రజాప్రతినిధులు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీభరత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు విశాఖపట్నంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు.
ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్.కోట, వేపాడ, జామి మండలాల నుంచి విజయం సాధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలుపొందిన ఎస్.కోట జడ్పీటీసీ డోకుల సునీత, వేపాడ జడ్పీటీసీ కొట్యాడ వెంకటలక్ష్మితో పాటు ఇతర ప్రజాప్రతినిధులను ఎంపీ శ్రీభరత్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ ప్రగతికి బాటలు వేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ (DCMS) చైర్మన్ తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సందర్భంగా నేతల మధ్య చర్చ జరిగింది. తమను ఆదరించి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.