"విజేతలకు అభినందనలు, యోధులకు జే జే లు - కాకాణి"
నెల్లూరు, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు లోని వైఎస్ ఆర్ సీపీ మండల కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అన్ని గ్రామాల నాయకులతో కలిసి చర్చించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా కాకాణి గోవర్థన్ రెడ్డి
- పరిషత్ ఎన్నికల్లో పోరాడి గెలిచిన ఎంపీటీసీ అభ్యర్థులను అభినందించిన కాకాణి
- టీడీపీ కుట్రలతో పోరాడి ఓటమిపాలైన అభ్యర్థుల పోరాట పటిమను యోధులతో పోల్చిన కాకాణి.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సీపీ శ్రేణులు గట్టిగా పోరాడాలని,ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, ప్రజలు సమాధానం చెబుతారని పేర్కొన్నారు
పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌లో భారీ అవకతవకలు.. గెలిచిన అభ్యర్థులను ఓడించి, ఓడినవారిని గెలిపించారు..
పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అధికార పార్టీ నేతలు అనేక అక్రమాలకు, అవకతవకలకు పాల్పడ్డారని కాకాణి ఆరోపించారు. నామినేషన్ల దాఖలును అడ్డుకోవడం, నామినేషన్ ఫారాలు స్వీకరించకుండా ఇబ్బందులకు గురిచేయడం, నామినేషన్లు వేయడానికి వెళ్లిన అభ్యర్థులపై దాడులు చేయడం, చించివేయడం,బెదిరింపులతో నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. అభ్యర్థుల ప్రమేయం లేకుండానే ఇతరుల సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణలు చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 79 ఎంపీటీసీ స్థానాలు, ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయని,అనేక బెదిరింపులు, ప్రలోభాలు ఎదురైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా ఎన్నికల్లో పోరాడారని తెలిపారు. పోలింగ్ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులను ధైర్యంగా ఎదుర్కొని, పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కౌంటింగ్‌లోనూ అక్రమాలు జరిగాయి..
ముఖ్యంగా ముత్తుకూరు, పొదలకూరు జెడ్పీటీసీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని కాకాణి ఆరోపించారు. సాధారణంగా ఐదు టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారని, ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్ల చొప్పున లెక్కించిన తర్వాత ప్రతి టేబుల్‌కు సంబంధించిన పార్టీ వారీ ఓట్ల రౌండ్ల వారీగా వివరాలను ప్రకటించి, మొత్తం 5,000 ఓట్లను ఒక రౌండ్‌గా పరిగణించాల్సి ఉంటుందని వివరించారు.అయితే, టేబుల్ వారీగా వచ్చిన ఓట్ల వివరాలను తమకు చూపించాలని, ప్రతి రౌండ్‌కు సంబంధించిన లెక్కలను వెల్లడించాలని రిటర్నింగ్ అధికారులను కోరినా స్పందన లేదని విమర్శించారు. ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాతే ఒకసారి తప్పుడు లెక్కలతో వివరాలు ప్రకటించారని తెలిపారు. ఒక టేబుల్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఆ ఓట్లను తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేయడం, టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఆ పార్టీ ఖాతాలోనే వేయడం వంటి తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. ఈ విధంగా మెజారిటీలను తారుమారు చేస్తూ, పూర్తి స్థాయి లెక్కింపు ముగియకముందే పొదలకూరు జడ్పిటిసి 46 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని విమర్శించారు. ముత్తుకూరు జెడ్పీటీసీ కౌంటింగ్‌లో మరింత తీవ్రమైన తప్పిదాలు జరిగాయని కాకాణి పేర్కొన్నారు. అక్కడి కౌంటింగ్ అధికారులతో తాను మాట్లాడినప్పుడు, లెక్కల్లో తప్పులు జరిగిన విషయం వాస్తవమేనని, కూడికల్లో పొరపాట్లు వచ్చాయని వారు అంగీకరించినట్లు తెలిపారు. సుమారు 500కు పైగా ఓట్ల తేడా వచ్చినప్పటికీ, 469 ఓట్ల మెజారిటీతో ఫలితాన్ని ప్రకటించాలని తమకు సూచించారని అధికారులు చెప్పినట్లు కాకాణి వెల్లడించారు. 514 ఓట్లు అధికంగా లెక్కలోకి వచ్చినట్లు గుర్తించి వాటిని తగ్గించినట్లు అధికారులు పేర్కొన్నా,514 ఓట్లు తొలగించిన తర్వాత కూడా ,అధికారుల లెక్కల ప్రకారం వై కా పా అభ్యర్థి గెలవాల్సి ఉంటే టిడిపి అభ్యర్థికి 57 ఓట్ల మెజారిటీని ఎలా ప్రకటించారని ప్రశ్నించారు.పొరపాటుగా కలిసిన ఓట్లను తీసివేసిన తర్వాత మిగిలిన లెక్కల ప్రకారం ఫలితాన్ని ప్రకటించాల్సి ఉండగా, 57 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ఫలితాన్ని ప్రకటించారని ఆరోపించారు. మైనస్‌లు, ప్లస్‌ల లెక్కల్లోనే తేడా తెలియని పరిస్థితి కౌంటింగ్‌లో కనిపించిందని, ఎన్నికల లెక్కలు చంద్రబాబు గణితంలా మారిపోయాయని ఎద్దేవా చేశారు.
రీకౌంటింగ్ పేరుతో అభ్యర్థులకు ఇబ్బందులు..
పైనాపురంలో ఫలితం సమానంగా ఉందని పోస్టల్ బ్యాలెట్ ఓటును కలపడంతో టిడిపి అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని కాకాణి ఆరోపించారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి గెలిచే చోట్ల మాత్రం పదేపదే రీకౌంటింగ్ నిర్వహించారని తెలిపారు. ఒకసారి కాదు, నాలుగైదు, ఆరు సార్లు రీకౌంటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని, చివరకు కౌంటింగ్ సిబ్బంది కూడా ఇక లెక్కింపు చేయలేమని చెప్పే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఫలితాలను ప్రకటించకుండా పదేపదే లెక్కింపు పేరుతో కాలయాపన చేశారని విమర్శించారు.
ప్రజాతీర్పును తారుమారు చేశారు..
ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అనేక ఇబ్బందులు, బెదిరింపులు, ప్రలోభాలు, కుట్రలు ఎదురైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడారని కాకాణి అన్నారు. ప్రజలు ఒక అభ్యర్థికి మద్దతుగా తీర్పు ఇచ్చినప్పటికీ, ఆ తీర్పుకు భిన్నంగా గెలిచిన అభ్యర్థులను ఓడించి, ఓడిపోయిన అభ్యర్థులను గెలిపించినట్లు ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. పరిషత్ ఎన్నికల్లో జరిగిన ఈ పరిణామాలన్నీ ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్న కాకాణి, ఎన్నికల ప్రక్రియలో ఎదురైన అవకతవకలను ప్రజలు గమనించారని తెలిపారు.
పోరాడి ఓడిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు యోధులు
పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసిందని కాకాణి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ముఖ్యంగా ముత్తుకూరు మండలంలోని దొరువుల పాలెం ఓట్ల లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాకు చావు దెబ్బ తగిలిందని సోమిరెడ్డి చించుకొని మాట్లాడుతున్నాడని, చావు దెబ్బ తగిలింది సోమిరెడ్డికి అని, మాకు కాదు అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు, సోమిరెడ్డి అధికారంలో ఉండి కూడా మేము 25 ఎంపీటీసీ సీట్లు గెలిచామని వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో సోమిరెడ్డి నిలబెట్టిన అభ్యర్థులకు 2 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే వచ్చాయని, ఎద్దేవా చేశారు అయితే అప్పట్లో తాము ప్రతిపక్ష అభ్యర్థులను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేయలేదని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో 27 మంది అభ్యర్థులు తాము నామినేషన్లు వేయలేమంటూ చేతులెత్తేసారని, మీరు ఎన్నికలకు ముందురోజు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని, విమర్శించారు. గతంలో మీకు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఇద్దరు మాత్రమే గెలిచారని, ప్రస్తుత ఎన్నికల్లో బెదిరింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే 79 మంది పోటీ చేసి 25 మంది విజయం సాధించారని వివరించారు. మిగిలిన స్థానాల్లో స్వల్ప మెజారిటీలతో ఓటమి పాలైనట్లు అధికారులు ప్రకటించారని తెలిపారు. ప్రధానంగా ముత్తుకూరు మండలం దొరువులపాలెం ఓట్లు లెక్కిస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మొదట 100 కు పైగా ఓట్ల ఆధిక్యం ఉన్నట్లు కనిపించిందని, మూడు రౌండ్లు ముగిశాక టీ బ్రేక్ ప్రకటించారని ఆరోపించారు. టీ బ్రేక్ సమయంలో అక్కడున్న సీఐలు, ఎస్ఐలు అందరినీ బయటకు వెళ్లాలని చెప్పి, లెక్కించిన ఓట్ల కట్లను, మళ్ళీ అందులో కలిపారని ఆయన ఆరోపించారు. కేవలం టీ బ్రేక్ పేరుతో ఓట్ల లెక్కింపును నిలిపివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆ సమయంలో వచ్చిన ఫలితం తమకు అనుకూలంగా ఉండి ఉంటే ముత్తుకూరు మండల పరిషత్ తమకు దక్కేదని వ్యాఖ్యానించారు. ముత్తుకూరు మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిందని, మరో ఒక్క స్థానం గెలిస్తే మండల పరిషత్ మాకు వచ్చేదని చెప్పారు. అయితే వరుసగాతొమ్మిది స్థానాలను టీడీపీకి అనుకూలంగా ప్రకటించారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, కోర్టులో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రతి రౌండ్ ఫలితాలపై ఏజెంట్ల సంతకాలు తీసుకున్నారా?
సాధారణంగా ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఆయా పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుని, అనంతరం రిటర్నింగ్ అధికారి సంతకం చేసి ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని వివరించారు. పొదలకూరులో అనేక రౌండ్ల లెక్కింపు జరిగినప్పటికీ ప్రతి రౌండ్ ఫలితాలను నిబంధనల ప్రకారం నమోదు చేశారా? కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. మొదటి నాలుగు రౌండ్ల ఫలితాలను సక్రమంగా ప్రకటించలేదని, ఐదో రౌండ్ తరువాత ప్రకటించిన వివరాల్లోనూ స్పష్టత లేదని ఆరోపించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మీద పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల రిటర్నింగ్ అధికారులు మేము లేవనెత్తిన అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు , వీటన్నిటిపై న్యాయస్థానంలో పోరాడుతామన్నారు. పరిషిత్ ఎన్నికల్లో నైతికంగా మేము గెలిచామని , 1/3 వంతు సీట్లు సాధించామని స్పష్టం చేశారు వైఎస్సార్సీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు పోలీసుల ద్వారా ఒత్తిళ్లు తీసుకొచ్చారని ఆరోపించారు. బూత్‌ల వద్ద చురుగ్గా పనిచేసే అభ్యర్థులను గుర్తించి వారిని బెదిరించడం, ఏదైనా గొడవ జరిగితే బాధ్యత మీదేనంటూ హెచ్చరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు రాజకీయ నాయకుల తరఫున మధ్యవర్తులుగా వ్యవహరించారని ఆరోపించారు. అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం, అభ్యర్థులతో నేరుగా మాట్లాడటం, మండల స్థాయి నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
చంద్రబాబు అనుభవం ఇదేనా? సోమిరెడ్డిపై పరోక్ష విమర్శలు
చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించిన తీరును ప్రస్తావించారు. అప్పట్లో పోటీకి అవకాశం ఇవ్వకుండా ముందుగానే రైతుల దగ్గర సంతకాలు తీసుకోవడం, ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీకి అనుకూలంగా నిర్వహించడం జరిగిందని విమర్శించారు. ప్రస్తుత పరిషత్ ఎన్నికల్లోనూ అదే తరహా విధానాన్ని అనుసరించారని, మొదట కౌంటింగ్‌కు పిలిచి, ఓట్లు లెక్కించిన తర్వాత ఫలితాలను తమకు అనుకూలంగా రాసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు వచ్చిన మెజారిటీలను గుర్తుచేస్తూ, ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికలు, తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మూడంతలు మెజారిటీ వచ్చిందని, అప్పట్లో అధికారంలో ఉన్నప్పటికీ తాము ఈ స్థాయిలో అక్రమాలకు పాల్పడలేదని, తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలయ్యమని, ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా టీడీపీ మెజారిటీలు సగానికి పడిపోయాయని, రేపు ఎన్నికల్లో కనుచూపుమేరా కూడా కనపడరని ఎద్దేవా చేశారు. సోమిరెడ్డికి ప్రజల మద్దతు తగ్గుతున్నప్పటికీ గొప్పలు చెప్పుకోవడం సరికాదని విమర్శించారు.
ఓడిపోయిన అభ్యర్థులకు కాకాణి భరోసా
గెలిచిన ఎంపీటీసీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూనే, ఓటమి పాలైన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు.అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ తరఫున ధైర్యంగా పోరాటం చేసిన అభ్యర్థులే నిజమైన యోధులని పేర్కొన్నారు. పోలీసు బలగాలు, బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా పోలింగ్ బూత్‌ల వద్ద ధైర్యంగా నిలబడి పోరాడిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. పోరాడకుండా ఓడిపోయిన వారికీ, పోరాడి ఓడిపోయిన వారికీ తేడా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గుండె ధైర్యంతో పోరాడారని, వారి పోరాటాన్ని పార్టీ గుర్తుంచుకుంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న కూటమి నేతలకు ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని కాకాణి విమర్శించారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీలు, ప్రస్తుత ఫలితాలను పోల్చి చూస్తే రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతోందని అన్నారు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ఉన్న ఉత్సాహం కంటే రెట్టింపు ఉత్సాహంతో పార్టీ శ్రేణులు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటమే ఊపిరిగా పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలను అభినందించారు. వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.