విద్యార్థుల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా. ఇస్కాన్ ఆధ్వర్యంలో దసరా కల్చరల్ క్యాంప్
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలు, సాంస్కృతిక అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ప్రొద్దుటూరులోని ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో ‘గోపాల్-ఇ-స్కూల్’ దసరా కల్చరల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు వెల్లడించారు. శుక్రవారం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు శిబిరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
రిలయన్స్ మార్ట్ సమీపంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు.
రెండు విభాగాల్లో శిక్షణ
ఈ శిబిరాన్ని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక విభాగంగా, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరో విభాగంగా నిర్వహించనున్నారు. విద్యార్థులకు మంత్ర ధ్యానం, భగవద్గీత శ్లోకాల పఠనం, నీతి కథలు, వివిధ కార్యకలాపాలు, ఆటలు, నృత్యం వంటి అంశాల్లో శిక్షణ అందించనున్నారు. చదువుతో పాటు ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, నైతిక విలువల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రతినిధులు వివరించారు. శిబిరంలో పాల్గొనే ప్రతి విద్యార్థికి ఆధ్యాత్మిక కానుకతో పాటు కోర్సు పూర్తి చేసినందుకు ధ్రువీకరణ పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రవేశ రుసుమును రూ.500గా నిర్ణయించినట్లు వెల్లడించారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు
శిబిరంలో భాగంగా అక్టోబర్ 20వ తేదీన మొత్తం 50 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భగవద్గీత శ్లోకాల విభాగానికి 25 మార్కులు, బహుళైచ్ఛిక ప్రశ్నల విభాగానికి 25 మార్కులు కేటాయించినట్లు పేర్కొన్నారు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రూ.6,000, ద్వితీయ బహుమతిగా రూ.3,000, తృతీయ బహుమతిగా రూ.1,000 నగదు బహుమతులు అందజేయనున్నారు. వీటితో పాటు మరో 10 ప్రోత్సాహక బహుమతులు కూడా అందించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 25వ తేదీ ఆదివారం విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రిజిస్ట్రేషన్లకు సంప్రదించాల్సిన నంబర్లు
ఈ దసరా కల్చరల్ క్యాంప్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు మరిన్ని వివరాలు, నమోదు కోసం 8520027510, 6303474393, 9912266036 నంబర్లను సంప్రదించాలని ఇస్కాన్ ప్రతినిధులు కోరారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
- అరికొండ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా