telangana
వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సందీప్ క్షేత్రస్థాయి కసరత్తును షురూ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనే ఇన్ఛార్జ్ బాధ్యతల్లో కొనసాగుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయడంతో, పార్టీ బలోపేతంపై సందీప్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.
ఈ క్రమంలో డిసెంబర్ 15 నుంచి ఆయన రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. కేవలం ఉమ్మడి జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుండా, కొత్త జిల్లాలకు స్వయంగా వెళ్లి నేరుగా మండల స్థాయి నేతలు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ వాస్తవ పరిస్థితులను సమీక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకుని, నాయకత్వం మధ్య సమన్వయం పెంచడమే ఈ పర్యటనల ప్రధాన ఉద్దేశం.
మరోవైపు, పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాల మధ్య స్పష్టమైన విభజనతో ముందుకు వెళ్లాలని అధిష్ఠానం నిర్ణయించింది. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, క్యాడర్ బలోపేతంపై ఇన్ఛార్జ్ సందీప్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించనుండగా.. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేయబోతున్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య ఈ పక్కా సమన్వయంతో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధించవచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తోంది.