ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ?
సూర్య, మందమర్రి.: ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతే ఇక గ్రామస్థులు ఎవరిని ఆశ్రయించాలి? గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ పాలకవర్గంపై లేదా? ప్రజల బాగోగులు చూస్తారని నమ్మి గెలిపించిన సర్పంచ్‌కు సమస్యను తెలియజేసినా, రోడ్డుపై కుళ్లిపోయిన శునక కళేబరం తొలగింపునకు నోచుకోకపోవడం తుర్కపల్లి గ్రామస్థుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మందమర్రి మండలం సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తుర్కపల్లి ఐదో వార్డు మెయిన్ రోడ్డులో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఓ శునకాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన శునకం అక్కడికక్కడే మృతి చెందింది. రోడ్డుపై పడి ఉన్న కళేబరం కుళ్లిపోతూ చుట్టుపక్కల ఇళ్లలోకి దుర్వాసన వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామస్థులు సారంగపల్లి గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పంచాయతీ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం మేరకు కారోబార్, కార్మికులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించినా, డబ్బులు ఇస్తేనే కళేబరాన్ని తొలగిస్తామని చెప్పి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరకక, కళేబరం అక్కడే ఉండిపోయింది.
-ఫిర్యాదు చేసినా ఫలితం ఇదేనా?
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించడం సర్పంచ్ బాధ్యతల్లో ముఖ్యమైనది. అలాంటిది ప్రజలు నేరుగా సర్పంచ్‌కు సమస్యను తెలియజేసినా, రోడ్డుపై కళేబరం తొలగించకపోవడం పాలకవర్గం పనితీరుపై విమర్శలకు దారితీస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఇలాంటి సమస్యలపై సర్పంచ్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల బాగోగులు చూస్తారని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే, కనీస పారిశుద్ధ్య సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితి ఎదురవుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఓట్లతో పదవిలోకి వచ్చిన వారు, ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోతే గెలిపించినందుకు తమకు చక్కటి గుణపాఠమే జరిగిందని వాపోతున్నారు. ఇప్పటికైనా సర్పంచ్ స్పందించి శునక కళేబరాన్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలను ఫిర్యాదులుగా మాత్రమే కాకుండా బాధ్యతగా స్వీకరించి పరిష్కరించాలని కోరుతున్నారు.