కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు*
కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్
*పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు*
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: కులాధిపత్యం, సామాజిక అసమానతలు, అంటరానితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ అన్నారు. పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలు, మహిళలు, పేదలకు విద్య అందించడమే లక్ష్యంగా పూలే తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.
మహిళా విద్యకు విశేష ప్రాధాన్యతనిస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల విద్యాభివృద్ధికి పునాదులు వేశారని గుర్తుచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం హక్కులు, అవకాశాలు కల్పించినప్పుడే పూలే ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు.
పూలే ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆయన చూపిన సామాజిక న్యాయం, సమానత్వం, విద్యాభివృద్ధి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జాజుల లింగంగౌడ్ పిలుపునిచ్చారు.