దేవరయంజాల్‌లో వృథాగా పారుతున్న తాగునీరు.. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువు
శామీర్‌పేట, మేజర్ న్యూస్ : ఓవైపు నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు.. మరోవైపు విలువైన నీరు రోడ్లపై వృథాగా పారుతున్నా పట్టించుకోకపోవడంపై దేవరయంజాల్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్‌పేట డివిజన్ దేవరయంజాల్ గ్రామంలో నీరు రోడ్లపైకి ప్రవహిస్తూ వృథా అవుతోంది. దీంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు నిరంతరం తడిగా ఉండటంతో పారిశుద్ధ్య కార్మికులు సైతం శుభ్రత పనులు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్, హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు నీటి పొదుపుపై నీతులు చెప్పే అధికారులు, కళ్లముందే విలువైన నీరు వృథా అవుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. నీటి వృథాను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నీటి వృథాకు కారణాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని దేవరయంజాల్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.