జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
నారుపేట బే పార్కింగ్‌ను తక్షణమే వినియోగంలోకి తేవాలి...
జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి...
ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో కలిసి భోగాపురం ఎయిర్‌పోర్ట్ మార్గంలో హైవే పరిశీలన...
విజయనగరం మేజర్ న్యూస్: జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడ లారీలను నిలిపివేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం నారుపేట వద్ద ఉన్న బే పార్కింగ్ స్థలాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో కలిసి ఆయన విజయనగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు ఉన్న జాతీయ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇటీవల జాతీయ రహదారిపై ఐదుగురి ప్రాణాలను బలిగొన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, రోడ్డు ప్రమాదాల నివారణపై ఎస్పీ, రవాణా, జాతీయ రహదారుల శాఖ అధికారులతో సమీక్షించారు. నారుపేట బే పార్కింగ్ స్థలాన్ని వెంటనే అందుబాటులోకి తెచ్చి, లారీలను అక్కడే నిలిపేలా డ్రైవర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్కడ డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సదుపాయాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
*పర్యటనలో కలెక్టర్ ఇచ్చిన ప్రధాన ఆదేశాలు:*
*మోదవలస జంక్షన్ అభివృద్ధి*
చెరువు నీరు రహదారిపైకి రాకుండా మళ్లించాలి. ఇక్కడ రోడ్డును వెడల్పు చేసి ట్రాఫిక్ ఐలాండ్ నిర్మించడంతో పాటు, సర్వీసు రోడ్డు నుంచి విజయనగరం రహదారికి వాహనాలు సులభంగా వచ్చేలా అనుసంధానించాలి.
*పోలిపల్లి వద్ద డివైడర్ సవరణ:* గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు పోలిపల్లి దాటిన తర్వాత వాహనాల రాకపోకలకు వీలుగా డివైడర్‌ను కొంతమేర తొలగించి మార్గం కల్పించాలి.
*సర్వీసు రోడ్డు అనుసంధానం:* భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారి కలిసే చోట సర్వీసు రోడ్డును ప్రధాన రహదారితో అనుసంధానించాలి.
ఈ పరిశీలన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మణికుమార్, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) ప్రభాకర్ అంజన్, ఆర్డీవో సుధాసాగర్ తదితరులు పాల్గొన్నారు.