సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల సైలెంట్ ఆపరేషన్.. 12 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్
పరిగి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా లక్ష్మీదేవిపల్లి సమీపంలోని సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసులు అత్యంత రహస్యంగా డ్రగ్ తనిఖీలు నిర్వహించారు.సీసీఎస్ పోలీసులు, స్థానిక సివిల్ పోలీసుల సమన్వయంతో సుమారు 50 మంది పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, డ్రగ్ టెస్ట్ కిట్ల సహాయంతో అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఈ పరీక్షల్లో దాదాపు 12 మందికి డ్రగ్ పాజిటివ్‌గా వచ్చినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. వీరు గంజాయి సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన వివరాలతో పాటు కార్మికులకు మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఫ్యాక్టరీ పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయా? ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల్లో మాదకద్రవ్యాల వినియోగం వెలుగులోకి వచ్చినట్లు వస్తున్న సమాచారం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.