48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మాదకద్రవ్యాలు, మద్యం వంటి చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన కెరీర్ తొలినాళ్ల అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుమారు 48 ఏళ్ల క్రితం నటుడిగా ఎదగాలనే తపనతో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన రోజుల్లో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకుని, నిబద్ధతతో ముందుకు సాగడం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని స్పష్టం చేశారు.
సినీ రంగంలో కొత్తగా అడుగుపెట్టిన రోజుల్లో ఒక సాయంత్రం స్నేహితుడితో కలిసి టీ తాగడానికి పాండీ బజార్‌కు వెళ్లిన సందర్భాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. అక్కడ కొందరు బీర్ తాగాలని, పార్టీలు ఇస్తూ పరిచయాలు పెంచుకుంటేనే అవకాశాలు వస్తాయని చెప్పారని, అయితే తాను ఆంజనేయస్వామి భక్తుడినని, అలాంటి అలవాట్లకు దూరంగా ఉంటానని స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి వచ్చేశానని వివరించారు. సరదా కోసం ఒక్కసారి తాగితే అది మరో అలవాటుకు దారి తీసే ప్రమాదం ఉంటుందని, వ్యసనాలకు బానిసైతే వ్యక్తి జీవితంతో పాటు కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు.
యువతకు ఉన్నది ఒక్కటే జీవితమని, ఆ జీవితాన్ని సార్థకం చేసుకునేలా లక్ష్యం వైపు పయనించాలని చిరంజీవి సూచించారు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు లేదా ఇతర ఏ రంగంలోనైనా ప్రతిభతో ఎదిగి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని కోరారు. వ్యసనాలకు బానిసైన మిత్రులను ఆదుకుని, పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత యువతపై ఉందని పేర్కొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న నషా ముక్త్ భారత్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చిరంజీవి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర ముగింపు సభలో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సానుకూల మార్పునకు నిదర్శనమని అన్నారు.