విద్యార్థి దశ నుంచే చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంవిద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కులు, బాధ్యతలు, చట్టాల గురించి తెలుసుకోవాలని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం. వంశీకృష్ణ అన్నారు. ముఖ్యంగా బాలల రక్షణకు ప్రభుత్వం రూపొందించిన చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం అనపర్తిలోని జీబీఆర్ జూనియర్ కళాశాలలో పోక్సో (POCSO) చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి ఎం. వంశీకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, దాడుల నుంచి వారిని రక్షించేందుకు పోక్సో చట్టాన్ని రూపొందించారని వివరించారు. బాలలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే ఈ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. బాలల భద్రతకు సంబంధించిన అంశాల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమకు ఎదురయ్యే వేధింపుల విషయంలో భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.విద్యార్థులు తమ చుట్టూ జరిగే అన్యాయాలు, చట్టవిరుద్ధమైన చర్యలపై అవగాహన పెంచుకోవాలని, చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. ఇటువంటి న్యాయ అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, సమాజంలో బాలల భద్రతకు దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి టి.వి.వి. రమణమూర్తి, న్యాయవాదులు నల్లమిల్లి వినూరెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జీబీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.పి. అబ్బాయిరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.ఆర్.ఎల్. స్వామి, వైస్ ప్రిన్సిపాల్ సోమశేఖర్, కోఆర్డినేటర్లు ఆనంద్, పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు ఆదినారాయణ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.