విద్యా సేవ నుంచి పురపాలక సేవకు - చైర్ పర్సన్ గంగాభవానికి అభినందనల వెల్లువ
పలాస, సూర్య : పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ చైర్ పర్సన్ గా ఎంపికైన వజ్జ గంగా భవానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శివాజీ నగర్ లోని మదర్ థెరిస్సా స్కూల్ కరెస్పాండెంట్ గా విద్యారంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ, ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ఆమెకు పురపాలక పీఠం దక్కడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ శుభ సందర్భంగా బుధవారం స్థానిక ప్రైవేట్ స్కూల్ ల కరెస్పాండెంట్లు మర్యాదపూర్వకంగా ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.మదర్ థెరిస్సా స్కూల్ ను పలాసలో ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా తీర్చిదిద్దడంలో గంగాభవాని పాత్ర కీలకమని కరెస్పాండెంట్లు కొనియాడారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, క్రమశిక్షణ, సంస్కారంతో కూడిన విద్యను అందించడంలో ఆమె ముందుంటారని తెలిపారు. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు.విద్యారంగంలో చూపిన అంకితభావాన్నే ఇక పురపాలక పాలనలో కూడా చూపించి, పలాస-కాశీబుగ్గను ఆదర్శ పురపాలక సంఘంగా తీర్చిదిద్దుతారని కరెస్పాండెంట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, వీధి దీపాలు, విద్యా సౌకర్యాల కల్పనలో ఆమె ప్రత్యేక దృష్టి పెడతారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలు ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్లు, యాజమాన్య ప్రతినిధులు పాల్గొని గంగాభవానికి శుభాకాంక్షలు తెలిపారు.