వీఆర్ఏలకు పేస్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి సీపీఐ * వల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల దీక్షకు మద్దతు * సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక..
వీఆర్ఏలకు పేస్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి
సీపీఐ
* వల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల దీక్షకు మద్దతు
* సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక..
వల్లూరు, మేజర్ న్యూస్
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్ఏలకు వెంటనే పేస్కేల్, ఉద్యోగ భద్రత, కారుణ్య నియామకాలు అమలు చేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జి.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేస్తున్నారని, అదే తరహాలో మన రాష్ట్రంలోని 20 వేల మంది వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం బతకడానికి సరిపడా కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించి, వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
వీఆర్ఏల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం మొండిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే వారు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ వెంటనే జోక్యం చేసుకుని వీఆర్ఏలతో చర్చలు జరపాలన్నారు. న్యాయమైన వారి డిమాండ్లను పరిష్కరించని పక్షంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు..