వరిలో సంభవించే తెగుళ్లపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి--ఏవో బ్రహ్మ రెడ్డి
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: ప్రస్తుతం వరి పంటలో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి బి బ్రహ్మరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ,ఈ తెగులు బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుందన్నారు. వరి ఆకుల చివరి భాగం లేదా అంచులలో నీటిలో తడిసినట్లుగా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయని,క్రమంగా ఈ మచ్చలు ఆకుల అంచుల వెంట వ్యాపించి, ఆకులు పసుపు రంగులోకి మారి చివరకు ఎండిపోతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు పూర్తిగా వాడిపోయే అవకాశం ఉంటుంద న్నారు. ముఖ్యంగా అధిక తేమ, నిరంతర వర్షాలు, బలమైన గాలులు మరియు పొలంలో అధిక నీరు నిల్వ ఉండటం వల్ల ఈ తెగులు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. తెగులు సోకిన పొలాల్లో అధిక మోతాదులో నత్రజని ఎరువులు (యూరియా, డీఏపీ) వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా మురుగు నీటిని బయటకు పంపించాలని ఆయన కోరారు.పంటకు సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలని, ముఖ్యంగా పొటాష్ ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో వినియోగించాలని తెలిపారు. తెగులు సోకిన పొలాల నుండి ఇతర పొలాలకు నీరు పారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నారుమడిలో మరియు ప్రధాన పొలంలో మొక్కల ఆకుల చివరలను కత్తిరించి నాటడం వంటి పద్ధతులను నివారించాలన్నారు. తెగులు ఉధృతి ఉన్నప్పుడ రాగి ఆధారిత మందులు వినియోగించాలని తెలిపారు. అవసరమైతే ప్రస్తుత ప్రభుత్వ సిఫార్సుల ప్రకారం మాత్రమే స్ట్రెప్టో సైక్లిన్ వంటి బ్యాక్టీరియా నివారణ మందులను ఉపయోగించాలి అని తెలిపారు. అదే విధంగా యాంటీబయాటిక్ మందులను అనవసరంగా, పదేపదే పిచికారీ చేయరాదనీ. మందుల మోతాదు, వినియోగ విధానం విషయంలో సంబంధిత ఉత్పత్తి లేబుల్ మరియు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
రైతులు వరి పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ప్రారంభ లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టి పంట నష్టాన్ని తగ్గించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు.