చిలకలూరిపేట న్యూస్: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పోలీసులు చూపిన ధైర్యసాహసాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.వరద ఉధృతిలో చిక్కుకుని ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురు మహిళలను చిలకలూరిపేట పోలీసులు సాహసోపేతంగా రక్షించారు.వరద ప్రవాహంలో చిక్కుకున్న మహిళలను కాపాడేందుకు చిలకలూరిపేట సీఐ సుబ్బనాయుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రంగంలోకి దిగారు.నడుముకు తాడు కట్టుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి దిగి మహిళల వద్దకు చేరుకున్నారు.పోలీసు సిబ్బంది సహకారంతో ఒక్కొక్కరినీ జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చి సురక్షితంగా కాపాడారు.వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పోలీసులు ప్రదర్శించిన తెగువ,సమయస్ఫూర్తి పలువురిని ఆకట్టుకుంది.ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న మహిళలను క్షేమంగా బయటకు తీసుకురావడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సాహసోపేతమైన రక్షణ చర్యలపై రాష్ట్ర హోంమంత్రి అనిత గురువారం స్పందిస్తూ మహిళలను కాపాడిన పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు.విధి నిర్వహణలో పోలీసులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.