-పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం
పటాన్‌చెరు;వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యానికి మానవ కార్యకలాపాలే ప్రధాన కారణమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కే. పురుషోత్తమ రెడ్డి అన్నారు. పటాన్‌చెరులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘శీతోష్ణస్థితి అంశాలు, విధానం, శాస్త్రం మరియు మానవ భవిష్యత్తు’అనే అంశంపై గురువారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్), కళాశాల విద్యాశాఖ, రూసా ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణహిత వ్యవసాయం, సేంద్రియ సాగు, సంప్రదాయ విత్తనాల సేకరణ, పరిరక్షణ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు సంప్రదాయ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా సేంద్రియ వ్యవసాయం, పర్యావరణహిత స్టార్టప్‌ల వైపు దృష్టి సారించాలని అన్నారు. గొట్టిగారిపల్లి, ముల్కనూర్ వంటి గ్రామాల్లో చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలను ప్రపంచానికి పరిచయం చేయాలని పేర్కొన్నారు.ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పులు ఆర్థిక, సామాజిక, ప్రకృతి సంబంధిత అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఇలాంటి సదస్సులు విద్యార్థులకు స్థానిక సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు సరైన దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. ప్రొఫెసర్ వి.శ్రీలత మాట్లాడుతూ ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలపై చర్చించేందుకు సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రొఫెసర్ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కళాశాల విద్యాశాఖ సెమినార్లు, వర్క్‌షాప్‌లను ప్రోత్సహిస్తోందన్నారు.పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంత కాలుష్యంతో గతంలో పోచారం, గణపురం, కంచర్ల, ఇంద్రేశం, దయారా తదితర గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ప్రజల పోరాటాలు, ప్రముఖుల ప్రయత్నాలతో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టిన విషయాన్ని పురుషోత్తమ రెడ్డి గుర్తుచేశారు. అనంతరం సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిమబిందు సాంకేతిక సమావేశంలో వాతావరణ సమస్యల కారణాలను వివరించారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ పి. సుజాత,కో-కన్వీనర్ డాక్టర్ జి. మల్లిక, ప్రొఫెసర్ వెంకటేశం, షరీఫ్ మియా,వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పూనమ్ కుమారి, పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.