వైసిపి శ్రేణులు అయోమయం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ రాజకీయ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పార్టీ కోసం పనిచేసి, తమకంటూ గుర్తింపు సంపాదించుకున్న పలువురు నాయకులు ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ సాగుతోంది.
మరోవైపు ద్వితీయ శ్రేణి నాయకత్వం, గ్రామస్థాయి కార్యకర్తలు ఉన్నప్పటికీ ఆర్థిక వనరుల కొరత పార్టీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, ఎన్నికల ఖర్చులను భరించే పరిస్థితి లేక పలువురు పోటీకి వెనుకడుగు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాయకత్వం అందుబాటులో లేక, ఆర్థిక అండ లేక, క్షేత్రస్థాయిలో ముందుకు ఎలా వెళ్లాలనే విషయంలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో స్పష్టత కొరవడిందనే చర్చ వినిపిస్తోంది.అసలు పార్టీని ముందుకు నడిపించేది ఎవరు? గ్రామస్థాయిలో నాయకత్వానికి దిశానిర్దేశం చేసేది ఎవరు? ఎన్నికల వేళ అభ్యర్థులకు అండగా నిలిచేది ఎవరు? అనే ప్రశ్నలు వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తున్నాయి.
రావులపాలెం వైఎస్సార్‌సీపీలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే.. పార్టీకి కార్యకర్తల బలం ఉన్నా, వారిని నడిపించే నాయకత్వం, ఆర్థిక భరోసా ఎక్కడ?అనేది ప్రశ్న గా మిగిలింది.