వైసీపీ శ్రేణుల పోరాట పటిమ అభినందనీయం - మాజీ ఎమ్మెల్యే.
అనపర్తి, మేజర్ న్యూస్. అనపర్తి నియోజకవర్గంలో గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చూపిన ధైర్యం, సమిష్టి కృషి అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ అభ్యర్థులు, బూత్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు చివరి వరకు పోరాడారని కొనియాడారు. నామినేషన్ల సమయంలోనూ అభ్యర్థులపై ఒత్తిళ్లు తెచ్చారని విమర్శించారు. అనపర్తి, గొల్లలమామిడాడ ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు పేర్కొంటూ, ఇన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించిన పోలింగ్ అధికారులు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.