వాటర్ సప్లయ్ స్కీమ్ కార్మికులకు శుభవార్త..
అనంతపురం కలెక్టరేట్.. రిపోర్టర్ వేణుగోపాల్..
వాటర్ సప్లయ్ స్కీమ్ కార్మికులకు శుభవార్త.. రూ.18 కోట్ల వేతన బకాయిలు మంజూరు!
మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో కార్మికులకు ఊరట..శ్రీ సత్యసాయి వాటర్ సప్లయ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌వీఎస్‌ఎస్‌పీ)లో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిల చెల్లింపునకు రూ.18 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో నెలల తరబడి జీతాల కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు ఊరట లభించనుంది.
కార్మికుల సమస్యపై మంత్రి చొరవ
వాటర్ సప్లయ్ స్కీమ్ కార్మికుల వేతన బకాయిల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ చొరవ తీసుకున్నారు. కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బకాయిల చెల్లింపునకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేశారు.
ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.18 కోట్ల నిధులు మంజూరు కావడంతో కార్మికుల్లో ఆశలు చిగురించాయి.
వేతన బకాయిల చెల్లింపునకు నిధులు మంజూరు కావడంతో కార్మికుల దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది.