గంట వ్యవధిలోనే స్పందన.. మహిళను కుటుంబ సభ్యులకు అప్పగింత
• బ్లూ కోర్ట్ పోలీసుల సేవలకు అభినందనలు
సూర్య, లక్షెట్టిపేట/మంచిర్యాల ప్రతినిధి : గోదావరిఖనికి చెందిన ఓ మహిళను గుర్తించి, ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించి లక్షెట్టిపేట బ్లూ కోర్ట్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖనికి చెందిన కమటం రమాదేవి అనే మహిళ కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేకుండా తిరుగుతోంది. ఈ క్రమంలో ఆమె లక్షెట్టిపేటలో ఉన్నట్లు గుర్తించిన కొందరు వ్యక్తులు గోదావరిఖనిలోని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న లక్షెట్టిపేటలో విధులు నిర్వహిస్తున్న బ్లూ కోర్ట్ పోలీసులు సాగర్ వర్మ, రాజమౌళి వెంటనే స్పందించారు. పట్టణంలో గాలింపు చేపట్టి మహిళను గుర్తించి, ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే పోలీసులు స్పందించి మహిళను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సత్వరమే స్పందించి మహిళను క్షేమంగా అప్పగించిన బ్లూ కోర్ట్ పోలీసులను ఎస్సై గోపతి సురేష్, సీఐతో పాటు మహిళ కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.