జీడికల్ శ్రీరామచంద్ర స్వామి ఆలయ హుండీ ఆదాయం 1.35 లక్షలు
లింగాలఘణపూర్ , మేజర్ న్యూస్, చారిత్రక పుణ్యక్షేత్రమైన జీడికల్ శ్రీ రామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్ట భద్రత నడుమ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వంశీ పర్యవేక్షణలో చేపట్టిన ఈ లెక్కింపులో దేవస్థానానికి మొత్తం రూ.1,35,500 నగదు ఆదాయం సమకూరినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు. భారతీయ కరెన్సీతో పాటుగా హుండీలో 10 అమెరికన్ డాలర్ల నోటు కూడా లభ్యమైనట్లు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఆలయంలో పలు సేవలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను, బహిరంగ వేలాన్ని అధికారులు పూర్తి పారదర్శకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రసాదాల విభాగమైన లడ్డూ, పులిహోర విక్రయాల టెండర్‌ను జమ్మికుంటకు చెందిన పరిమళ కిశోర్ అత్యధికంగా రూ.3,61,000 లకు దక్కించుకున్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన మిగతా పనుల టెండర్లు కూడా ప్రశాంతంగా, సజావుగా ముగిశాయి.ఈ కార్యక్రమంలో జనగామ ఆర్డీవో, లింగాలఘణపురం తహశీల్దార్ అండాలు, ఎంపీడీవో శివశంకర్ రెడ్డి, తో పాటు జీడికల్ గ్రామ సర్పంచ్ కొండబోయిన మమత సంపత్ యాదవ్, దేవస్థాన కమిటీ చైర్మన్ ఏలే మూర్తి, అర్చకులు కృష్ణమాచార్యులు, భార్గవాచార్యులు, ఆలయ సిబ్బంది భరత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, కార్తీక్, లింగాల గణపురం జనగామ జిల్లా