andhrapradesh
వాల్ మార్ట్ వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ
అమరావతి / విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులతో పాటు స్థానిక కళాకృతులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. నేడు ఆయన వాల్‌మార్ట్ వైస్ ప్రెసిడెంట్‌తో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, మార్కెటింగ్ అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ‘స్వయం ఏపీ’, ‘లేపాక్షి’ బ్రాండ్ల ఉత్పత్తులను వాల్‌మార్ట్ వేదికల ద్వారా దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేయాలని లోకేష్ ప్రతిపాదించారు. రాష్ట్రంలో ఫ్లిప్‌కార్ట్ చేపడుతున్న పెట్టుబడుల ద్వారా సుమారు 28 వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం ఎస్‌ఎల్‌ఎన్ (SLN) కాఫీ చైర్మన్ శతప్పన్‌తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘అరకు కాఫీ’ని అంతర్జాతీయ మార్కెట్లకు మరింత విస్తృతంగా పరిచయం చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, యూరప్ మరియు రష్యా దేశాల మార్కెట్లకు అరకు కాఫీని ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి అరకు కాఫీ బ్రాండింగ్ ఎంతో కీలకమని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.